
నల్గొండ: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాము టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కారెక్కబోతున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు(అసిఫాబాద్), రేగ కాంతారావు (పినపాక)లు అధికార టీఆర్‌ఎస్ పార్టీ చేరనున్నట్లు బహిరంగానే ప్రకటించారు. ఇదిలా ఉండగా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, ఆయన గురువారం రాత్రి సీఎం కేసీఆర్ కూడా కలిశారని జోరుగా ప్రచారం సాగుతోంది.
నల్గొండ జిల్లాలో ముఖ్య నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్( కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి)కు చిరుమర్తి లింగయ్య ప్రధాన అనుచరుడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం లింగయ్యకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించగా.. కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి మరీ అధిష్ఠానాన్ని ఒప్పించి ఎమ్మెల్యే టికెట్ ఆయనకు వచ్చేలా చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం ఒకరకంగా ఈ బ్రదర్స్ ఇద్దరికీ షాకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరుమర్తి పార్టీ మార్పు జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవాకు గొడ్డలిపెట్టే. అంతేకాదు, ఈ వ్యవహారంపై ఇటు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు.
చిరుమర్తి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇందులో నిజమెంతో తెలుసుకునేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చిరుమర్తి లింగయ్య, ఆయన అనుచరులు పలువురు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంత నమ్మకద్రోహమా?: రాజగోపాల్ రెడ్డి ఫైర్…
చిరుమర్తి లింగయ్య పార్టీ మార్పు వార్తలపై కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుమర్తి ఇంత నమ్మకద్రోహం తలపెడతాడని అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను కూడా వార్తల ద్వారానే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు.
తమ పార్టీ అధిష్ఠాన వర్గాన్ని ఒప్పించి రెండుసార్లు ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించి.. గెలుపు కోసం కృషి చేశామని, అలాంటిది పార్టీ మారే విషయం కనీసం తమకు కూడా చెప్పలేదంటూ రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.








