గజ్వేల్: కేసీఆర్ ప్రత్యర్థిగా.. కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన భావోద్వేగ ప్రసంగం విని కొందరు మహిళలు కన్నీరుపెట్టుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన వంటేరు ప్రతాప్ రెడ్డి సొంతూరులో ఓ సంఘటన ఎదురైంది.
వివరాలోకి వెళ్ళితే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని తన స్వగ్రామమైన బూర్గుపల్లికి వెళ్లారు.
‘‘ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక ఎప్పటికీ కనిపించను..’’
ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడుతూ… ‘‘పదిహేనేళ్లుగా నేను మీ మధ్యనే ఉంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్నాను. గజ్వేల్‌లో ఇల్లు కట్టుకుందామనుకున్నాను. కానీ నేను ప్రతిపక్ష నేతననే కారణంతో నాకు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ఊర్లో ఉంటున్న మా ఇల్లు కూలిపోయింది. పట్టణంలో అద్దెకు ఉంటున్నాను. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే.. ఇక ఎప్పటికీ కనిపించను..’’ అంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఆయన భావోద్వేగపు మాటలు విని చలించిపోయిన కొందరు మహిళలు వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో అధైర్య పడకండి.. పోరాడి గెలుద్దాం అంటూ ప్రతాప్ రెడ్డి వెంటనే ఆ మహిళలను ఓదార్చారు.
చదవండి: సంచలనం: రెండ్రోజుల్లో కాంగ్రెస్‌లోకి.. టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
చదవండి: ‘అతిరథ మహారథులు’ అంటే ఎవరో తెలుసా?