కోదాడ: త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్‌కు తెలంగాణ ఎన్నికల సంఘం షాకిచ్చింది. కోదాడ నుంచి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఎన్నికల బరిలో హాస్యనటుడు వేణుమాధవ్.. కోదాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ!
తన స్వస్థలం అయిన కోదాడ నుండి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న వేణు మాధవ్.. శుక్రవారం నామినేషన్ వేసేందుకు కోదాడ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవంటూ…
అయితే అక్కడి ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారులు ఆ నామినేషన్ పత్రాలను పరిశీలించి.. సరిగ్గా లేవంటూ తిరస్కరించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సరైన వివరాలతో ఉంటేనే నామినేషన్ స్వీకరిస్తామని రిటర్నింగ్ అధికారి తెలుపడంతో వేణుమాధవ్ నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ… ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా సరైన పత్రాలు సమకూర్చుకుని మరో రెండు రోజుల తర్వాత మళ్లీ నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. కోదాడ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీకి దిగడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ టిక్కెట్ లభించకపోవడంతో…
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వేణు మాధవ్ సినీ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గడంతో ఆయన చూపు రాజకీయాలపై పడింది.
గతంలో తెెలుగుదేశం పార్టీ తరపున పలు సందర్భాల్లో వేణుమాధవ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ పార్టీ తరపున తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావించారు. అయితే టీడీపీ టిక్కెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తన స్వస్థలమైన కొదాడ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాలని ఆయన భావిస్తున్నారు.