
హైదరాబాద్: నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు సభ్యులను రాచకొండ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 150 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో వరుస దొంగతనాలతో వణుకు పుట్టించిన చెడ్డీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నవంబర్ నెలలో చెడ్డీ గ్యాంగ్ ఆరు దోపిడీలకు పాల్పడింది.
ఈ గ్యాంగ్ సభ్యులు ఒంటిపై చెడ్డీలు మాత్రమే ధరిస్తారు. కాళ్లు, చేతులకు నూనె పూసుకుంటారు. ఆ తర్వాత దొంగతనాలకు వస్తారు. పట్టుబడకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఒళ్లంతా నూనె పూసుకుంటారు. బీహార్‌కు చెందిన ఈ ముఠా తెలంగాణలో హల్ చల్ చేసింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల దొంగతనాలు చేసి కలకలం రేపింది. ముఖ్యంగా నగర శివారులో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది.








