
విశాఖపట్నం: ఏపీలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో గత రాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీచ్ రోడ్ లో ఉన్న దివంగత సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను అధికారులు తొలగించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల ఈ విగ్రహాలని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అయితే ఈ ముగ్గురి విగ్రహాల ఏర్పాటు సమయంలోనే స్థానికులు కొందరు, ఏ మాత్రం విశాఖకు సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలను తెచ్చి సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని కోర్టును ఆశ్రయించారు.
చదవండి: అమరావతికి తరలిన వైసీపీ ప్రధాన కార్యాలయం! ఫర్నీచర్ తరలింపు పూర్తి!
ఇక కోర్టు కూడా వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించింది. దీంతో స్పందించిన పోలీసులు, జీవీఎంసీ అధికారులు గత రాత్రి వీటిని తొలగించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సినీ అభిమానులు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.
అయితే అనుమతి లేని విగ్రహాలను తాము తొలగిస్తామని పోలీసులు అభిమానులకి గట్టిగా చెప్పి అక్కడ నుంచి పంపించేశారు.







