

ఏలూరు: తాము అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల కోట్లు బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఖర్చుపెడతామని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు.
ఏలూరులో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ‘బీసీ గర్జన’ సభలో ఆయన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించడమేకాక ఇంకా పలు కీలక ప్రకటనలు చేశారు.
బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే సమగ్ర బీసీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్ జగన్ తెలిపారు. బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, అలాగే బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్ చేయూత కింద ప్రతి ఏడాది రూ.75 వేలు అందజేస్తామని ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఈ డబ్బును పంపిణీ చేస్తారని చెప్పారు.
పేదవాడి సంక్షేమం కోసం రెండడుగులు ముందుకేస్తా…
‘‘పేదవాడి సంక్షేమం కోసం దివంగత నేత, నాన్న వైఎస్సార్ ఒక్క అడుగు ముందుకు వేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తాను. మీ పిల్లలను కలెక్టర్, డాక్టర్, ఇంజినీర్ ఏదైనా చదివించండి. ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాం. హాస్టల్‌లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందజేస్తాం’’ అంటూ వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం ధర్మం కాదని అన్నారు. రాష్ట్రంలోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవని, అయినా నాలుగున్నరేళ్లు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఈ కులాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 32 కులాలను బీసీ జాబితాలో చేర్పిస్తామని వెల్లడించారు.
అంతేకాదు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని కూడా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అలాగే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేసి.. వారికి రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. దుకాణాలు పెట్టుకున్న నాయి బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు.
వైఎస్‌ఆర్ బీమా కింద రూ.7 లక్షలు…
పేదవాడు ప్రమాదవశాత్తు చనిపోతే వైఎస్‌ఆర్ బీమా కింద రూ.7 లక్షలు అందజేస్తామని, అప్పుల వాళ్లు ఆ కుటుంబాన్ని వేధించకుండా అసెంబ్లీలో చట్టం చేస్తామని జగన్ చెప్పారు. ప్రభుత్వం ఆడపడుచుకు ఇచ్చిన కట్నంగా ఆ డబ్బును అందిస్తామన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
సహకార డెయిరీకి పాలు పోస్తే లీటర్‌కు రూ.4 అదనంగా చెల్లిస్తామన్నారు. ప్రధాన ఆలయాల్లో నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం అందజేస్తామన్నారు. ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నాయి బ్రాహ్మణులు, యాదవులకు చోటు కల్పిస్తామని జగన్ ప్రకటించారు.
జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశం…
సంచార జాతులకు ఉచితంగా ఇల్లు, ఉపాధి కల్పిస్తామని, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10 వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామన్నారు. మత్స్యాకారులకు ఇచ్చే డీజిల్‌పై సబ్సిడీ పెంచుతామన్నారు.
బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా జగన్ బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని, తాము చేసిన మంచి పనులు చెప్పుకుని ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రజలను ఓటు అడుగుతామని ఆయన విజ్ఞప్తి చేశారు.








