
సత్తెనపల్లి : ఔను, నిజమే అక్కడ టీడీపీ ఓడిందంటే, ఇక రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయినట్టే, జగన్ సీఎం అయినట్టే.. అదేంటి? ఆ ఒక్క సీట్లో ఓడితే ఏమవుతుంది.. అంటారా? అదే మరి సెంటిమెంట్ అంటే. ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు, నాయకులు రకరకాల సెంటిమెంట్లను తెరపైకి తెస్తుంటారు.
రాజకీయాలలో సెంటిమెంట్‌కి చాల ప్రాధాన్యం..
అలాంటి సెంటిమెంట్‌కు బలం చేకూరుస్తోంది గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం. 1955లో సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. సత్తెనపల్లిలో టీడీపీ గెల్చినప్పుడల్లా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తూ వచ్చింది. అలాగే సత్తెనపల్లిలో ఓడిపోయినప్పుడల్లా ఆ పార్టీ అధికారానికి దూరమవుతోంది.
1983లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా నన్నపనేని రాజకుమారి గెలిచారు. ఆ ఎన్నికల్లో అధికారం టీడీపీ కైవసమైంది. 1985 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ సీపీఎం అభ్యర్థి గెలిచారు. మళ్లీ టీడీపీదే అధికారం.
1989లో టీడీపీ మద్దతిచ్చిన సీపీఎం అభ్యర్ధి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారానికి దూరమైంది. 1994లో వామపక్ష అభ్యర్థి మళ్లీ గెలిచారు. దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
1999లో వైవీ ఆంజనేయులు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి గెలిచారు. ఆ రెండుసార్లు టీడీపీకి అధికారం దక్కలేదు. 2014లో కోడెల గెలిచారు. మళ్లీ తెలుగుదేశం అధికారం కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు ఒప్పుకుంటారా? ఇక్కడ టీడీపీ ఓడితే కాబోయే సీఎం జగనే అని.








