
గుంటూరు: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానిని ఎదిరించి లోక్‌సభలో మాట్లాడానని.. వెంటనే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని చెప్పారు. ఆదాయ పన్ను అధికారులు దాడులు చేస్తామని తనను బెదిరించారని తెలిపారు.
అందుకే మహేశ్‌పై ఐటీ దాడులు
పన్నులు సరిగా కట్టడం వల్ల తనవైపు రాలేకపోయారని వ్యాఖ్యానించారు. తననేమీ చేయలేక తన బావ, టాలీవుడ్ హీరో మహేశ్‌బాబుపై ఐటీ దాడులు చేసినట్టు గల్లా జయదేవ్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం పన్ను చెల్లింపుదారుగా తాను ఉన్నానన్నారు.
ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకేం చేశారో మోదుగుల చెప్పాలని ఈ సందర్భంగా గల్లా డిమాండ్ చేశారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.
మిర్చి, పసుపు మద్దతుధర కోసం లోక్‌సభలో మాట్లాడినట్టు తెలిపారు. దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరానన్నారు. గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.903 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారెవరైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా, మహేశ్ బాబు పేరును ఎన్నికల సమయంలో గల్లా తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి:అక్కడ టీడీపీ ఓడితే.. జగన్ సీఎం! టీడీపీని టెంక్షన్ పెడుతున్న ఆ సెంటిమెంట్!








