28.8 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మీ గొడవలు మాపై రుద్దొద్దు: కేసీఆర్, చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.?

మీ గొడవలు మాపై రుద్దొద్దు: కేసీఆర్, చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.?

- Advertisement -

గుంటూరు: రాజకీయాలు, గొడవలు ఏమైనా ఉంటే మీరు మీరే చూసుకోవాలని గానీ, ప్రజలపైనా రుద్దవద్దంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులకు సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత ఏడాది ఇచ్చాపురంలో ప్రారంభించిన ప్రజా పోరాటయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో ముగిసింది. ఈ సందర్భంగా పాతపల్నాడు బస్టాండ్‌ వద్ద బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు.

‘తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకటే అడుగుతున్నా.. మీ రాజకీయ క్రీడలు ఆపండి. ఏమైనా గొడవలుంటే మీరిద్దరే చూసుకోండి. యువత, సామాన్యుల మీద రుద్దకండి. తెలంగాణలోని ఓ ఐటీ కంపెనీపై దాడులు చేయిస్తున్నారు. కేంద్రం కూడా టీడీపీ మీద కోపంతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తోంది’ అని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు.

అంతేగాక, ‘ప్రస్తుతం రాష్ట్రంలో మూడు విధానాలున్నాయి.. ఒక పార్టీ ఏమో 2019లో తమ అధినేతే మళ్లీ అధికారంలోకి రావాలని, ఆ తరవాత ఆయన కుమారుడు రావాలని ప్రచారం చేస్తోంది. మరో పార్టీ 30 ఏళ్లు తమ అధ్యక్షుడే అధికారంలో ఉండాలని ప్రతి ఇంట్లో, కార్యాలయంలో ఆయన ఫొటోలే ఉండాలని కోరుకుంటోంది. జనసేన మాత్రం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వారు అభివృద్ధి చెందడం ద్వారా వారి ఫొటోలే ఇంట్లో ఉండాలని కోరుకుంటోందని.. అదే తమ పార్టీ ధ్యేయం’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

జనసేన పెట్టింది ముఖ్యమంత్రి అవుతాననో, రాష్ట్రంలో పెనుమార్పులు తెస్తాననో కాదు.. ప్రస్తుత రాజకీయ కుట్రలతో విసిగిపోయి పార్టీ ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని పవన్‌ పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్, వైసీపీకి మద్దతివ్వచ్చు.. జనసేన మాత్రం వైసీపీతో కానీ, టీడీపీతో కానీ కలిసి పోటీచేయదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగా, అంతకు ముందు ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్‌ కళ్యాణ్‌ జనసేన కార్యకర్తలు, విద్యార్థులు, వీరమహిళలతో విడివిడిగా సమావేశమయ్యారు. జనసేన అధికారంలోకి వస్తే డీఎస్సీ, పోటీ పరీక్షలకు వయోపరిమితిని పెంచుతామని, ఏటా వాటిని నిర్వహిస్తామని పవన్ హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు దరఖాస్తు రుసుముల పేరిట ప్రభుత్వం రూ.కోట్లు వసూలు చేస్తోందని, జనసేన అధికారంలోకి వస్తే అన్ని పరీక్షలకు ఒకేసారి రుసుము చెల్లించే విధానాన్ని తీసుకువస్తామని పేర్కొన్నారు.

నన్ను చూసే ఓట్లేయండి.. పవన్

జనసేన అభ్యర్థులుగా ఎవర్ని నిలబెట్టినా తనను చూసి ఓట్లు వేయాలని ఆయన కోరారు. వారి చేత పనిచేయించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తామని అన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసి, నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారాయన. ప్రకాశం జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని, కనిగిరిలో ఫ్లోరోసిస్‌ సమస్య నివారణకు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనసేనలో కష్టపడే ప్రతి నాయకుడికీ గుర్తింపు ఇస్తామని, ఎవరికి వారు నాయకుడిగా ప్రకటించుకోవద్దని పవన్‌ కోరారు.

చదవండి: డేటా స్కాం తీవ్రమైంది: ‘చంద్రబాబు దొంగ’ అంటూ జగన్ నిప్పులు

- Advertisement -