
నాగ్‌పూర్: మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరు వినగానే అభిమానుల్లో తెలియని జోష్ కనిపిస్తుంది. అతన్ని చూడగానే అభిమాన గణం సంబరాలు చేసుకుంటుంది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. వారు చూపించే అంతులేని అభిమానాన్ని ధోనీ కూడా అంతే ప్రేమగా స్వీకరిస్తాడు. ఎన్నోసార్లు బారీకేడ్లను దాటుకుని, సెక్యూరిటీని తప్పించుకుని.. గ్రౌండ్‌లో ఆడుతున్న ధోనీ దగ్గరికి పరుగెత్తుకొచ్చారు అభిమానులు.
అయితే, ఆ ఆధరాభిమానాల్ని అర్థం చేసుకున్న వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, పలకరించి పంపిస్తుంటాడు ధోనీ. అయితే, నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా గ్రౌండ్‌లోని దూసుకొచ్చిన అభిమానిని ధోనీ భలే ఆటపట్టించాడు. అతడికి చిక్కకుండా సహచరుల చాటున దాగుతూ, దూరంగా పరుగెత్తాడు. చివరగా, స్టంప్స్ దగ్గరకు వెళ్లి ఆగిపోయిన ధోనీ అభిమానిని అప్యాయంగా కౌగిలించుకుని, భుజం తట్టి పంపించాడు.
మరోసారి అభిమానాన్ని చాటుకున్న…
భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు టీమిండియా ప్లేయర్లు గ్రౌండ్‌లోకి వస్తున్నారు. అందరూ ముందు వస్తుండగా ధోనీ కాస్త వెనకాలే వస్తున్నాడు. ఇంతలో సెక్యూరిటీని తప్పించుకుని గ్రౌండ్‌లోకి వచ్చిన ఓ అభిమాని ఆటగాళ్ల ముందుకొచ్చాడు. అయితే అతను మిగితావాళ్లను వదిలేసి ధోనీ వైపే వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అది గమనించిన ధోనీ అతణ్ని ఆటపట్టించాడు. ఇతర ఆటగాళ్ల వెనకాల దాక్కుంటూ, అటూఇటూ పరుగెత్తుతూ అభిమానికి దొరక్కుండా స్టంప్స్ వైపు వెళ్లాడు.
చివరకు స్టంప్స్ దగ్గర ఆగిన ధోనీ, అభిమానికి ఆత్మీయంగా హగ్ ఇచ్చాడు. తన అభిమాన ఆటగాడు అంత చనువుగా ఆటపట్టించడం, దగ్గరగా తీసుకుని హత్తుకోవడంతో, ఆ యువకుడి ఆనందానికి హద్దుల్లేవు. ఆనందంగా గ్రౌండ్‌ను వీడాడు.
చదవండి:రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్ ఉత్కంఠ విజయం! 500వ మ్యాచ్ లో విజయం!








