
హైదరాబాద్: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయిలో ఉంది. పార్టీల అధినేతలు తమ అభ్యర్ధులని గెలిపించుకునేందుకు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబు పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసాడు.
చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికి రక్షణ లేదని, ఏకంగా ప్రతిపక్ష నేతగా ఉన్న తననే చంపించే ప్రయత్నం చేశారని వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పాడు. రాష్ట్రంలో వ్యవస్థలను సర్వనాశనం చేశారని, ప్రతిపక్ష నేతకే రక్షణ లేని పాలనలో ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా వినుకొండలో సభలో జగన్ మాట్లాడుతూ నిన్ననే మీరంతా చూశారు. రాష్ట్రంలో ప్రజల పాలన ఉందా, లేక చంద్రబాబు పెట్టుకున్న పోలీసుల పాలన ఉందా ఆలోచించండి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత చంద్రబాబు తనకు కావాల్సిన అధికారులతో ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు.
ఇంటలీజెన్సీ అధికారులు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని ఈసీ ఆ అధికారినిన పక్కన పెడితే..ఆ ఆర్డర్లను పక్కన పెట్టించిన ఘనుడు చంద్రబాబు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారు. మరొక్కమారు చంద్రబాబుకు ఓటు వేస్తే ఏ మనిషినైనా బతకనిస్తారా, ఆలోచన చేయాలని కోరారు. ప్రజల్లో ఉన్న తననే ఏకంగా చంపించడానికి ప్రయత్నించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై హత్యాయత్నం చేస్తే.. గంటలోపే డీజీపీ వచ్చి ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
బాబు స్క్రీప్ట్ ఇస్తే ఆ ప్రకారం డీజీపీ మాట్లాడుతున్నారు. బాబు కోసం సాక్షాత్తు ఎన్నికల కమిషన్ ఆర్డర్లు ఇచ్చినా కూడా ఆ ఆర్డర్లను పక్కనపెడుతున్నారు. ఇది మన రాష్ట్రంలో అత్యున్నత పరిపాలన. బాబు ఆర్డర్లతో పని చేసిన స్పీకర్‌ను చూశాం.వ్యవస్థలను ఏ స్థాయిలో చంద్రబాబు నాశనం చేశారో ఈ పాలన చూడండి.
ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేని పాలనలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. తన సొంత చిన్నాన్నను హత్య చేయించి, ఆ నేరాన్ని మా కుటుంబ సభ్యులపై నెట్టుతున్నారని, చంద్రబాబుకు మేలు చేసేలా విలువలేని ఒక యాక్టర్‌తో, ఒక పార్టనర్‌తో ఒక పార్టీ పెట్టించారు. కుట్రలో భాగంగా మరో పార్టీని పెట్టిస్తారు.
ఆ పార్టీ గుర్తు, కండువా, చివరికి అభ్యర్థి పేరు కూడా వైయస్ఆర్సీపీ మాదిరిగా ఉండేలా పార్టీ పెట్టించారని మండిపడ్డారు. ఆ పార్టీ హెలికాప్టర్ గుర్తు ఎవరిదో మీకు తెలుసన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా అని జగన్ ప్రశ్నించారు.








