
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫాంలను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయవాడలోని ఐలాపురం హోటల్లో తమ పార్టీ ప్రతినిధులపై దాడి చేసి బీఫాంలను ఎత్తుకెళ్లారని, అందులోని పేర్లను పోలిన అభ్యర్థులతో నామినేషన్లు వేయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడు దొంగలని ధ్వజమెత్తిన పాల్.. వారు గెలిచే అవకాశం లేదని అన్నారు.
చంద్రబాబు మనిషిని కాదు..
తాను చంద్రబాబు మనిషిన కాదని స్పష్టం చేశారు. తాను బాబు మనిషిని అయితే టీడీపీని ఓడించాలని ఎందుకు చెబుతానని ప్రశ్నించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను గెలిపించినట్లే ఆంధ్రాలో ప్రజాశాంతి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే నర్సాపురాన్ని నార్త్ అమెరికా చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు.
అంతేగాక, ఓటర్ల జాబితాలో అవకతవకలపై విచారణ జరిపేంత వరకు ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను వాయిదా వేయకపోతే తామే బహిష్కరిస్తామని కేఏ పాల్ అన్నారు. ఎన్నికలు వాయిదా కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.








