జగన్‌పై దాడి వ్యూహాత్మకం, ఇది బీజేపీ ఆడిస్తున్నఆట: చంద్రబాబు

cm-chandrababu
- Advertisement -

cm chandrababu

 

విశాఖపట్నం: జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇంకా ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ సంఘటనపై విచారణ  చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభును పలువురు కోరారు. విమానాశ్రయంలోకి, లాంజ్‌లోకి ఒక వ్యక్తి కత్తిని ఎలా తీసుకురాగలిగారని వారు ప్రశ్నించారు.

ఈ పరిణామాలన్నింటిని గమనించిన తెలుగుదేశం.. ఇదేదో రాజకీయ కుట్రలా, తెలుగుదేశం పార్టీపై వ్యూహాత్మక దాడిలా భావించి.. అప్పటికప్పుడు గురువారం అర్థరాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ పెట్టి సంఘటనపై తన అభిప్రాయాలను, సందేహాలను వివరించారు. అది ఆయన మాటల్లోనే..

బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే…

ఇదంతా చూస్తుంటే బీజేపీ ఆడిస్తున్న డ్రామాలా కనిపిస్తోంది. ఇదెప్పుడో  నటుడు శివాజీ..‘ ఆపరేషన్ గరుడ’ అనే పేరు పెట్టి వివరించాడు. బహుశా జగన్‌పై దాడి కూడా అందులో భాగమే అయి ఉంటుంది. ఇదంతా బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. ఇందులో సందేహమే లేదు. నిజానికి ఇది క్రిమినల్ కేస్ కిందకు వస్తుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా నాయకుడిపై దాడి జరిగితే.. కనీసం నాకు చెప్పకుండా.. అంటే సీఎంను సైతం కాదని.. డీజీపీకి, అధికారులకు నేరుగా గవర్నర్ ఫోన్ చేసి నివేదిక కోరడం వెనుక మర్మం ఏమిటో తెలుసుకోవాలి..

మొదట ఇక్కడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాలి. అలాకాకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్లిపోయారనేది తెలియాలి.. అసలు అంత దాడి జరిగిన తర్వాత.. గాయపడిన జగన్‌ను విమానం ఎందుకు ఎక్కించారు. అక్కడికి చేరుకున్న తరువాత కూడా ఆయన ముందు తన ఇంటికెళ్లి.. కొంతసేపు విశ్రాంతి తీసుకుని.. అప్పుడు తీరిగ్గా ప్రైవేటు  ఆసుపత్రికి వెళ్లి జాయిన్ అయ్యారు.

ఒకరకంగా విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. అందువల్ల  ఈ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

సానుభూతి రావడానికే ఇలా…

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. దాడి చేసిన శ్రీనివాసరావు వైసీపీ పార్టీ వీరాభిమాని.. కేవలం జగన్‌కి  సానుభూతి రావడానికే ఇలా కత్తితో దాడిచేసినట్లు. ఆ నిందితుడు  రాసిన లేఖలో వివరంగా తెలియజేశాడని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.  నిజంగా జగన్ బాధ్యత కలిగిన వ్యక్తి అయితే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. హైదరాబాద్ వెళ్లాలి. మరెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే ఇది పథకం ప్రకారం జరిగింది కాబట్టే.. కామ్‌గా విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మధ్యాహ్నం 12.40కి  ఘటన జరిగితే  సీఐఎస్ఎఫ్ అధికారులు.. 4.30కు ఫిర్యాదు చేశారు.  ఇది పథకం ప్రకారమే జరిగింది తప్ప మరొకటి కానే కాదని సీఎం చంద్రబాబునాయుడు నొక్కి వక్కాణించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులపై దాడులను సహించమని తెలిపారు.

ఆసక్తికరంగా మారిన లేఖ సారాంశం…

మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాసరావు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న లేఖను విడుదల చేశారు.

” ప్రజలు దైవంగా భావించే వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే  చాలా అభిమానం. ఆయన పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.  నేడు చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, పథకాల వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు..” అంటూ సుదీర్ఘ లేఖ రాసి.. అనేక అంశాలు అందులో ప్రస్తావించారు.  అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేయాలో కూడా సూచనలు చేశారు.  జగన్ అధికారంలోకి వస్తే ప్రజలను ఆదుకోవాలని కోరారు.

నిందితుడి సలహాలు, సూచనలు…

అయితే ఇవన్నీ చదివిన చాలామంది.. జగన్ ఎవరిమాటా వినడు.. సీనియర్లనే పట్టించుకోడు.. ఇక శ్రీనివాసరావు చెప్పినది వింటాడా? వైసీపీ పార్టీ అభిమానిని అని చెప్పుకునే నిందితుడు శ్రీనివాసరావుకి జగన్ ఎలాంటివాడో తెలీదా? ఎందుకీ పిచ్చి పని చేశాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. పోనీ ఇంత రిస్క్ తీసుకొని పోలీసు కస్టడీలోకి వెళ్లే శ్రీనివాసరావు ఇంత చిన్న లాజిక్‌ని ఎలా మిస్సయ్యాడని పలువురు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది? ముఖ్యమైన పాయింట్లు మీరూ చూడండి…

‘‘ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, పథకాల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అర్హులకు పథకాలు చేరడం లేదు, లబ్ధి పొందినవారికే మళ్లీ మళ్లీ  ప్రయోజనం కలుగుతోంది.  దోపిడీ, లంచగొండితనం, మద్యపానం, ముఖ్యంగా పనులు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే. దీనికోసం భారీ ఎత్తున దళారీ వ్యవస్థ నడుస్తోంది. వీటిపైనే చంద్రబాబునాయుడి పాలన నడుస్తోంది.’’

ఈ తరహాలో రాసుకెళ్ళాడు. అయితే శ్రీనివాసరావు ఇంటర్మీడియట్ డిస్ కంటిన్యూ చేశాడు. చేసేది హోటల్ లో వెయిటర్ ఉద్యోగం.. ఆ ఉత్తరం చూస్తే మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడు మాత్రమే రాయగలడని కొందరు పేర్కొంటున్నారు.

- Advertisement -