‘టగ్ ఆఫ్ వార్’ జోన్‌లోకి.. టీఆర్ఎస్! తెలంగాణలో ఎన్నికల పోరు రసవత్తరం !!

kcr-mahakutami-jitta
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది.  మహాకూటమి వ్యక్తుల పరంగా  చూస్తే మహాబలంగా ఉంది. అటు కాంగ్రెస్‌‌లో హేమాహేమీలు, తెలుగుదేశంలో రాజకీయ ఉద్ధండులు, టీజేఎస్‌లో కీలకనేతలు కనిపిస్తున్నారు. అలాగే తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రాభవాన్ని కూాడా తక్కువగా అంచనా వేయలేం.. వారూ ఇక్కడే  ఉన్నారు.

ఇంకా యువజన సంఘాలతో నిండి ఉన్న యువ తెలంగాణ పార్టీ  ఉండనే ఉంది. ఇలా అన్ని శక్తులు కలిసి.. టీఆర్ఎస్‌పై  ఎదురు దాడికి దిగుతున్నాయి. ఒకవైపు కేసీఆర్ అపర చాణక్యుడిలా వ్యూహాలు  పన్నుతున్నా.. అటువైపు కాంగ్రెస్ జాతీయపార్టీ.. నేతలు కూడా ఆ స్థాయి గలవారే ఉన్నారు. ఇక వారి వ్యూహరచనలు కేసీఆర్ లాగే  ముందుచూపు కలిగినవే.

చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018: ఎత్తులు, పై ఎత్తులతో.. వేడెక్కిన తెలంగాణ రాజకీయం

అంతేకాకుండా సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. హనుమంతరావు, శ్రీధర్ బాబు, షబ్బీర్ ఆలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి  నేతలున్నారు. తెలంగాణలో  ఒకప్పుడు తెలుగుదేశానికి  కంచుకోటలుగా ఉన్న స్థానాలు, వాటి నాయకులు, ఎన్నోఏళ్లు ఉమ్మడి ఆంధ్రాను  పరిపాలించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాన వ్యూహకర్తగా ఉన్నారు.

మరోవైపు తెలంగాణ ఉద్యమంలో  ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులను ఒక తాటిపై నడిపిన  ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్లున్నారు.  అన్నింటికన్నా ముఖ్యంగా.. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో 30 వేల యువజన సంఘాలను సమన్వయపరిచి, వారికి మార్గనిర్ధేశం చేసిన యువ తెలంగాణ పార్టీ అధినేత జిట్టా బాలకృష్ణారెడ్డి వీరికి అండగా ఉన్నారు.

‘టగ్ ఆఫ్ వార్’ జోన్ లోకి..  ‘టీఆర్ఎస్’

ఇన్నాళ్లూ వార్  వన్‌సైడ్, టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకని అన్నవారందరూ.. రోజులు దగ్గర పడే కొద్దీ ఇప్పుడదంత  ఈజీ కాదంటున్నారు. అటువైపు  అందరూ కలిసిపోయారు. ఇటువైపు ఒక్కరే అయిపోయారు. ముస్లింలు కలిసి ఉన్నా.. టీాఆర్‌ఎస్‌కు ఆ సీట్లు పెద్ద కలిసి రాకపోవచ్చునని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

ఇన్నాళ్లు కేసీఆర్‌కి ప్రజలు మరొక అవకాశం ఇస్తారనే అనుకున్నారంతా.. కానీ రానురాను సమీకరణాలు మారిపోతున్నాయి. ఎవరూ వంద శాతం కరెక్టు కాదు.. కానీ కేసీఆర్ సరిచేసుకోవాల్సినవి కొన్ని ఉన్నా.. ఆయన  ఎవరి  మాటా వినకపోవడంతో సెల్ఫ్ గోల్ చేసుకుంటారేమోనని కొందరు పేర్కొంటున్నారు.

మరోవైపు  టీఆర్ఎస్ ను టగ్ ఆఫ్ వార్ జోన్ వరకు తీసుకువచ్చిన ప్రతిపక్ష నేతలు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై కురిపిస్తున్న విమర్శల్లో కొన్ని…

  1. రాష్ట్రంలోనే ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండీ  ఆ హుందాతనాన్ని కాపాడకుండా ఎదుటివారిని నోటికొచ్చినట్లు తిట్టడమనే  అంశంపై.. కేసీఆర్ తీవ్రమైన విమర్శలపాలవుతున్నారు. అది తెలిసినా ఆయన లెక్క చేయడం లేదు. ఏమన్నా అంటే ఆంధ్రా సెంటిమెంటు అని సమర్థించుకుంటున్నారు.  ఎన్నాళ్లు, ఎన్నాళ్లీ సెంటిమెంటు? అని కొందరు సెటైర్లు పేల్చుతున్నారు.
  2. . ఆయనెవరి మాట వినరు… నా  మాటే వినాలి.. నేను చెప్పినదే వేదం..అనే ధోరణి కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలెవరికి ఆయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు.  అనే విమర్శలు తీవ్రంగా  వినిపిస్తున్నాయి.
  3.  కోదండరామ్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి లాంటి వారికి చేసిన అన్యాయం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు వారిద్దరి దగ్గరే యువత ఉండటం.. నాడు తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుండి నడిపిన విద్యార్థులు ఇప్పుడు వీరి వెంట ఉన్నారు. ఇది టీఆర్ఎస్ గెలుపు పై  తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.
  4.  ఈ నాలుగున్నరేళ్లలో కే సీ ఆర్ ని ఎదుర్కున్నవారుగానీ, ఎదిరించి మాట్లాడినవారు గానీ లేరు.. ఈ  పైన పేర్కొన్న వీరే వేదికెక్కి కేసీఆర్ ని ధైర్యంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఉన్నా.. మహాకూటమిలోకి వచ్చాక..ఆయన ప్రసంగాలు మరింత వెలుగుచూస్తున్నాయి.

జిట్టా బాలకృష్ణారెడ్డి రాకతో.. యువతలో నూతనోత్సాహం

జిట్టా బాలకృష్ణారెడ్డి.. తెెలంగాణ రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారుండరు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన వారిలో.. వేళ్లపై లెక్క పెట్టాల్సి వస్తే  ఆ సంఖ్యలో.. జిట్టా ముందు వరుసలో ఉంటాడు. ఆయన  సేవాభావాన్ని, సామాజిక దృక్ఫథాన్ని విమర్శించేవారెవరూ ఉండరు. భువనగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఆయన చేసిన మంచి పనులకు లెక్కేలేదు.

ఒక్కముక్కలో చెప్పాలంటే ఎలిమినేటి మాధవరెడ్డి తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న  ప్రజానాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి.  తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కి కుడి భుజంగా ఉన్న జిట్టాను.. ఒక దశలో అవమానకరమైన రీతిలో బయటకు పంపిన వైనాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

కొన్ని వేల యువజన  సంఘాలతో జిట్టాకు మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం వారందరినీ సమన్వయపరచి యువ తెలంగాణ పార్టీని బలోపేతం చేశారు. ఈనేపథ్యంలో మహాకూటమిలో పొత్తుల్లో భాగంగా జిట్టాకు భువనగిరి  నియోజకవర్గం కోరుతున్నారు. అంతా పూర్తయి..సీటు ప్రకటిస్తే.. తను ప్రజావేదికలపైకి వచ్చి..చేసే ప్రసంగాలతో.. టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎందుకంటే తెలంగాణ  ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నారు. ఆరోజుల్లో ఉద్యమం కోసమైతేనేం..సామాజిక సేవకోసమైతేనం..ఆయన రూ.20కోట్లు పైనే ఖర్చు చేశారు. అవే డబ్బులు ఆయన వ్యాపారాల్లో పెట్టుంటే..వెయ్యి కోట్లు పైనే అయ్యేవని కొందరంటున్నారు.

కించిత్ స్వలాభాపేక్ష లేకుండా ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసిన ఆయన తెలంగాణ  ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడలో ఎన్నో ఆర్థికపరమైన అంశాల్లో కీలక భూమిక పోషించిన ఆయన .. టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలలో మొదటి  మెట్టు నుంచి ఉన్నారు.. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ ను పల్లకి ఎక్కించేందుకు.. ఆ పల్లకిని మోసిన బోయిలలో జిట్టా ప్రథముడు. తన భుజం అరిగిపోయేలా.. భువనగిరి లో కేసీఆర్ సభలకు లక్షలు కుమ్మరించాడు. భువనగిరి కొండంతా లైటింగ్ లు, పెట్టి హోరెత్తించాడు.

ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ సభలకు ఒక గ్లామర్ తీసుకువచ్చింది జిట్టా బాలకృష్ణారెడ్డి అనే చెప్పాలి. ఒక సందర్భంలో హెలికాఫ్టర్ కూడా పెట్టి కేసీఆర్ ను తీసుకొచ్చిన ఘనత.. తెలంగాణ రాష్ట్రం మొత్తమ్మీద ఆరోజుల్లో జిట్టాకే దక్కింది.  అలాంటి కీలకమైన వ్యక్తి.. ప్రచారంలోకి వస్తే.. టీఆర ఎస్ కు  కొన్ని ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  కేసీఆర్ లాంటి మహాశక్తిని ఎదిరించిన వారెవరూ లేరు.  కోదండరామ్, రేవంత్ రెడ్డి, ఇక చివరిగా జిట్టా బాలకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారు. అలా  ఒక్కడు ఒంటరిపోరాటం చేశాడు, రాజకీయంగా ఎంతో నష్టపోయాడు గానీ కేసీఆర్ కి మాత్రం లొంగని ఆయన తీరును , ధైర్యాన్ని అందరూ  మెచ్చుకుంటున్నారు.

మేథావుల ఆవేదన…

కేసీఆర్ తిట్ల  పురాణం చదువుతుంటే..మహాకూటమిలో కొందరు నేతలు తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. అతన్ని ఆపమనండి..మేం ఆపుతామని వీరంటున్నారు. తెలంగాణ మేథావులు .. మన భాషను ఇలా కించపరుచుకోవడం తగదని హితవు చెబుతున్నారు.

పదిమంది పదిరకాలుగా హేళన చేసుకుంటూ మాట్లాడుకునే పరిస్థితి కల్పించవద్దని కోరుతున్నారు. ఏమన్నా అంటే ఇది మా సంస్కృతి అనడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. అభివృద్ధిని ప్రశ్నించాలి.. లేదా ఏ అభివృద్ధి జరగలేదని మాట్లాడుకోవాలి తప్ప.. వ్యక్తిగతంగా దూషణలకు దిగడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవతల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునిలా మాట్లాడటం సరికాదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తదితరులు భాష, మాట్లాడేవిధానం పై బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తెలంగాణలో పరిష్కారం కాని సమస్యలు మంచినీరు, యువతకు ఉద్యోగాలు లాంటివాటి ఎన్నోవాటిపై పార్టీలు విమర్శించుకోవాలి గాని..ఇలా వెళ్లడం సరికాదని వారు పేర్కొంటున్నారు.

బలోపేతం అవుతున్న మహాకూటమి…

మహాకూటమి చాలా సీరియస్ గా డ్రైవ్ చేస్తోంది. వారి ఆలోచనలు, వ్యూహాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. దానికి తోడు టీఆర్ఎస్ సొంత పార్టీలో లుకలుకలు..వీరికి కలిసి వస్తున్నాయి.  ఎంత కాదనుకున్నా.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న  చాలామంది ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం వారన్నది నిర్విదాంశం.

వారందరూ ఒకప్పుడు మిత్రులే… అంతేకాకుండా సీఎం స్థాయిగల నేతలందరూ అక్కడ చేరారు. ఎన్నికలలో ఆరితేరిపోయి ఉన్నారు.. వారి రాజకీయ జీవితంలో ఇలాంటివెెన్నో చూశారు. గెలుపు ఓటముల విశ్లేషణలు, ముందస్తు వ్యూహాలు, లెక్కలు, సమీకరణాలు, ఎన్నో వాటిపై వారికి సంపూర్ణమైనృ అవగాహన ఉంది. అంతేకాకుండా నాలుగు పార్టీల సీట్ల సర్దుబాటు  కూడా సమైఖ్యంగా సాగడం..ఒక విజయమనే చెప్పాలి.

ఇక అసంతృప్తవాదులను వారు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పదవులు ఒకరి చేతి కింద ఉండవు.. అంతా ఢిల్లీ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడకకు వెళ్లి చెప్పుకోవచ్చు. దానిపై ఒక కమిటీ వేసి..న్యాయన్యాయాలు విచారిస్తారు. దీనివల్ల అప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులోనైనా వారికి మేలు  జరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉంది. ఎవరు ఎవరినైనా మాట్లాడవచ్చు. విమర్శించవచ్చు. రేపోమాపో సీట్ల ప్రకటన జరిగిపోతే వార్..ఓపెన్ వార్ గా మారుతుంది. కోడి పందాల బరిలో ఏ కోడి గెలుస్తుందనే దానిపైనే అందరి చూపు  ఉంటుంది. ఎవరి బలమెంతో వారే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో రసవత్తరమైన పోరుకు తెర లేవనుంది.

-శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -