
అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి? దానివల్ల మీకు కలిగిన నొప్పేంటి? అంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై విరుచుకుపడ్డారు బీజేపీ నేత, సినీ నిర్మాత అంబికా కృష్ణ. ఈ విషయంలో తన సపోర్ట్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌కేనంటూ ఆయన తేల్చేశారు.
ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన అంబికా కృష్ణ… అందులో జనసేనానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. అంతేకాదు, జేడీ లక్ష్మీనారాయణ తీరుని ఆయన తప్పుపట్టారు.
జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పవన్ మళ్లీ సినిమాల్లో నటించడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. అంతేకాదు, పవన్ విధానాల్లో నిలకడ లేదంటూ విమర్శించారు. దీనిపై నిర్మాత అంబికా కృష్ణ స్పందించారు.
‘‘సినిమాలు మానేసి రాజకీయాలే చేయాలని ఉందా?’’
‘‘పవన్ సినిమాల్లో నటిస్తున్నందుకే నేను రాజీనామా చేస్తున్నా అని లక్ష్మీనారాయణ చెప్పడం నేను విన్నాను.. ఇది చాలా బాధాకరం.. పవన్ సినిమాలతో హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు మానేసి రాజకీయాలే చేయాలని ఎక్కడా లేదు..’’ అన్నారాయన.
అంతేకాదు, ‘‘ఎవరు ఏ వృత్తిలో ఉంటే వారు దాన్ని వ్యాపారంగా చేసుకుంటారు. అందులో తప్పేముంది? అసలు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేంటి?’’ అంటూ వెనకేసుకొచ్చారు అంబికా కృష్ణ.
‘‘నాకు వచ్చిందే అది.. అందుకే చేస్తున్నా..’’
మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లేవంటూ పరోక్షంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు మీద సెటైర్లు కూడా వేశారు.
అంతేకాదు, తనకు భారీగా జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా లేవంటూ పరోక్షంగా సీబీఐ మాజీ జేడీని సైతం టార్గెట్ చేశారు. తనకు వచ్చిన పని సినిమాలు చేయడమేనని, తనను నమ్ముకుని ఉన్న వారిని, కుటుంబం కోసం తనకు వచ్చిన పని చేస్తున్నానని పవన్ వ్యాఖ్యానించారు.
రెండేళ్ల తర్వాత ఒకేసారి రెండు సినిమాలు…
ఇన్నాళ్లూ రాజకీయాల్లో బిజీ కావడంతో రెండేళ్ల నుంచి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలైంది. అలాగే, క్రిష్ హీరోగా మరో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ సంతకం చేశారు.
ఇలా ఒకేసారి ఆయన రెండు సినిమాలను పట్టాలెక్కించడంతో పవన్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. కొందరు నిర్మాతలు కూడా పవర్ స్టార్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.
అయితే పవన్ మళ్లీ సినిమాల్లో నటించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. కొందరేమో ఆయనకు మద్దతు పలుకుతున్నారు. పార్టీని నడిపించడానికి నిధులు అవసరమని, అందుకే పవన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చారంటూ వారు సమర్థిస్తున్నారు.








