
అమరావతి: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం బాధగా ఉందని అన్నారు.
ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామందికి కరోనా సోకడంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మత సదస్సుకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన వారికి కూడా వైరస్ సోకిందని చెప్పారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారందరిని తాము ట్రేస్ చేస్తున్నట్టు చెప్పారు.
చదవండి: కరోనాకు వైద్యం చేస్తూ మరణిస్తే కోటి: కేజ్రీవాల్
ఢిల్లీ వెళ్లినవారు, వారితో కలిసి ప్రయాణం చేసిన వారిని కూడా గుర్తిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వైరస్ సోకితే ఏదో జరిగిపోతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
‘‘కరోనా కేసులు పెరగడం బాధాకరమే…’’
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని, వృద్ధులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వైరస్ సోకడాన్ని పాపంగానో, తప్పుగానో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం బాధాకరమన్నారు.
రాష్ట్రంలో 87 కేసులుంటే అందులో 70 కేసులు ఢిల్లీకి వెళ్లి వచ్చినవాళ్లే ఉన్నారన్నారు. 1085 మంది రాష్ట్రం నుంచి ఢిల్లీ సదస్సుకు వెళ్లారని జగన్ చెప్పారు. 585 మందికి పరీక్షలు చేశామని, 70 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
మరో 21 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో కలిసి తిరిగినవారు స్వచ్చందంగా 104కి కాల్ చేసి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకుంటే తక్కువవుతుందని చెప్పారు. కేవలం 14 శాతం మందిని ఆస్పత్రికి తరలించామన్నారు.
‘‘చికిత్స అనంతరం నయమవుతోంది..’’
చికిత్స తీసుకున్న తర్వాత చాలామందికి నయం అవుతుందని తెలిపారు. దేశాల ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకూ కూడా వైరస్ సోకిందన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడిందని జగన్ పేర్కొన్నారు.
ఆక్వా రంగం, ఫుడ్ మిల్స్, ఆయిల్స్ మిల్స్ అందరూ పనిచేసుకోవచ్చని, మందులు తీసుకుంటూ వైద్యుల సలహాను పాటిస్తుండాలని పేర్కొన్నారు. కరోనాను పూర్తిగా నయం చేయవచ్చున్నారు.
జీతాలను వాయిదా వేసుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు జగన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
రైతులు మధ్యాహ్నం వరకు తమ పనులు చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆక్వా రంగం బతకాలని, ఆక్వా రైతులు బతకాలన్నారు. కరోనా వచ్చిన వాళ్లను ద్వేషించవద్దని, దాన్ని తప్పుగా చూడొద్దని జగన్ సూచించారు.








