
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలో ఆర్5 జోన్‌ను ప్రకటిస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది.
రాజధాని మాస్టర్ ఫ్లాన్‌లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను సీఆర్డీఏలోని సెక్షన్ 41 ప్రకారం మాస్టర్ ప్లాన్‌ని మార్పు చేయాలంటే, స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.
అంతేకాదు ప్రభుత్వ వాదనను కూడా హైకోర్టు విన్నది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 17కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
అమరావతి ప్రాంతంలో ఆర్5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల వారికి కాకుండా, గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలకు చెందిన వారికి స్థలాలు ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇందుకోసం ఆర్5ను ప్రభుత్వం సృష్టించింది. సీఆర్డీఏ చట్టాన్ని అందులోని మాస్టర్ ప్లాన్‌ను మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.
అయితే ఈ ప్రతిపాదనలు చట్టపరమైన ప్రక్రియను, నింబంధనను పాటించకుండా చేస్తున్నారని, సీఆర్డీఏ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని రాజధాని రైతులు హైకోర్టు ఆశ్రయించారు.








