‘సైరా’ చిత్ర బృందానికి షాక్.. కథానాయకుడి ఇంటి సెట్‌ను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు!

- Advertisement -

syra

హైదరాబాద్‌ : ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర బృందానికి రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్‌లో కొంత భాగాన్ని రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా  ప్రభుత్వ భూమిలో సెట్స్ వేశారని, దీంతో కూల్చివేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించడంతో చిత్ర నిర్మాణ బృందం అవాక్కయింది.

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్ర నిర్మాత కూడా మెగాస్టార్‌ తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.  రామ్‌చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ చిత్రం కోసం వేసిన సెట్స్‌లోనే ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న చిత్రం ‘సైరా’ షూటింగ్ కూడా జరుగుతోంది.

అనుమతి తీసుకోలేదంటూ…

అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో రెవెన్యూ అధికారులు రంగ ప్రవేశం చేశారు.  ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా ఆ భూమిలో సెట్స్ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ‘సైరా’లో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చివేశారు.  ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు అందించినా స్పందించలేని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.

అనుమతి తీసుకోకుండా సెట్ వేయడమే చిత్ర యూనిట్ చేసిన తప్పు అని, అనుమతి అడిగితే ఉచితంగానైనా పర్మిషన్ ఇచ్చి ఉండేవారమని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, ఎలాంటి అనుమతి తీసుకోకుండా సెట్ వేసి, ఆ తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనేది చిత్ర యూనిట్ ప్రణాళికలో ఓ భాగమని, భూకబ్జాకు ఇది ముందస్తు ప్లాన్ అని రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకనే సెట్స్ కూల్చేసినట్టు చెబుతున్నారు.  అయితే ఈ ఘటనపై ‘సైరా’ చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.

- Advertisement -