వాషింగ్టన్: మూడ్రోజుల క్రితం ఆకాశంలో అద్భుతం చూశారు కదా.. అయితే ఈరోజు మరో అద్భుతం చూసేందుకు రెడీ అయిపోండి. అవును, అంగారక గ్రహం వచ్చేసింది. 15 ఏళ్ల తర్వాత.. భూమికి అత్యంత చేరువగా అంగారక గ్రహం (మార్స్) వచ్చేసింది. మంగళవారం భూమికి 5.76 కోట్ల కిలోమీటర్ల సమీపానికి మార్స్ వస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
చీకటి పడగానే ఇళ్లల్లోంచి బయటకు వచ్చి దక్షిణం దిక్కుగా ఆకాశంలోకి చూస్తే.. అరుణ వర్ణంలోని ఈ గ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు సూర్యుడు, మరోవైపు మార్స్, మధ్యలో భూమి.. ఇలా ఈరోజు మూడు ఖగోళ రాశులు సరళరేఖలోకి రానున్నాయి. 2003లో కూడా అంగారకగ్రహం ఇలా భూమికి అత్యంత చేరువగా వచ్చింది. అప్పుడు 5.57 కోట్ల కిలోమీటర్ల సమీపంలో మార్స్ కనిపించింది.
60 వేల ఏళ్ల తర్వాత అంగారకుడు భూమికి ఇంత సమీపానికి వచ్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ వెల్లడించింది. మళ్లీ 2287లోగానీ ఆ గ్రహం మనకు అంత చేరువగా రాదని పేర్కొంది. 2020లో మాత్రం 6.2 కోట్ల కిలోమీటర్ల దూరం వరకు వస్తుందట. ఇప్పటికే అమెరికాలాంటి కొన్ని చోట్ల మార్స్ ప్రకాశవంతంగా కనిపిస్తుండగా.. మంగళవారం మరింత ప్రకాశవంతంగా, స్పష్టంగా కనిపించనుంది.
అంతేకాదు, ప్రస్తుతం అంగారక గ్రహాన్ని దుమ్ము, ధూళిలతో కూడిన భారీ తుఫాను కమ్మేసినట్లు ‘నాసా’ చెబుతున్నది. ఈ తుఫాన్‌ను సాధారణ టెలిస్కోపుల ద్వారా కూడా చూడొచ్చట. మంగళవారం భూమికి అంత్యంత చేరువగా వచ్చే ఈ అంగారక గ్రహం మన దేశం నుంచి స్పష్టంగా కనిపిస్తుందట.. మరి ఆలస్యమెందుకు.. చీకటి పడగానే బయటికొచ్చి అంగారక గ్రహాన్ని చూసేయండి.
Get outside TONIGHT to see Mars as it approaches Earth closer than it has been in 15 years! Here’s what you need to know: https://t.co/ttrx73J9AV pic.twitter.com/NUs1w96p7W
— NASA (@NASA) July 31, 2018