హైదరాబాద్: ‘బాహుబలి’ ప్రభాస్ పెళ్లెప్పుడు..? కొన్నేళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం అటు ప్రభాస్ అభిమానులతోపాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌లో రెండు సినిమాలొచ్చాయి కానీ.. ప్రభాస్ నోట పెళ్లి మాట మాత్రం రాలేదు. యంగ్ రెబల్ స్టార్ ఎవరిని పెళ్లాడతాడనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
హీరోయిన్ అనుష్క, ప్రభాస్ మధ్యన ఏదో కెమిస్ట్రీ నడుస్తోందని, ప్రభాస్ ఆమెనే వివాహం చేసుకుంటాడనే పుకార్లు గుప్పుమన్నప్పటికీ.. అలాంటిదేం లేదంటూ ఆ మధ్య అనుష్క తేల్చేసింది. అయినా అభిమానులు మాత్రం వారిద్దరి జోడీ అదిరిపోతుందనే ఊహల్లోనే ఉన్నారు. పోనీ, అనుష్క కాకపోతే మరొకరు.. కనీసం ఈ ఏడాదైనా ‘డార్లింగ్ ’ ఓ ఇంటివాడవుతాడేమోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే అక్టోబర్ 23న తన పుట్టిన రోజు సందర్భంగా ‘గుడ్ న్యూస్’ చెబుతానంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ప్రకటించాడు. దీంతో బర్త్ డే సందర్భంగా.. ప్రభాస్ తన పెళ్లి ప్రకటన చేస్తాడనే అందరూ అనుకుంటున్నారు.
కొత్త వదంతుల ప్రకారం..
ప్రభాస్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తన బంధువుల అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ప్రభాస్ పెళ్లాడనున్న అమ్మాయిది గుంటూరు అని, ఈ అక్టోబర్ 23న తన ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలను డార్లింగ్ ప్రకటిస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సాహో సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక 2019 మధ్యలో అతడి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారట.