22.7 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home క్రికెట్ కటక్ వన్డే భారత్‌దే.. కోహ్లీసేన చారిత్రక గెలుపు

కటక్ వన్డే భారత్‌దే.. కోహ్లీసేన చారిత్రక గెలుపు

- Advertisement -

కటక్: సిరీస్ విజయాన్ని తేల్చే మూడో వన్డేలో భారత్ విజయాన్ని అందుకుని సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. సొంతగడ్డపై ఎదురులేదని మరోమారు నిరూపించుకుంది. విండీస్ విసిరిన 316 పరుగుల విజయ లక్ష్యాన్ని 6 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండాన్ని అందుకుంది. వరుసగా పది సిరీస్ విజయాలతో కోహ్లీ సేన రికార్డులకెక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) తొలి వికెట్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. 57 పరుగుల వద్ద లూయిస్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోస్టన్ చేజ్ (38) కూడా బ్యాట్ ఝళిపించాడు.

ఈ క్రమంలో హోప్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్ (37) మెరుపులు చూసి మళ్లీ వీరబాదడు తప్పదేమో అనిపించింది. చేజ్‌తో కలిసి ఎడాపెడా షాట్లు కొడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు.

అయితే, కొత్త కుర్రాడు నవ్‌దీప్ సైనీ వీరిద్దరినీ బోల్తా కొట్టించాడు. అయితే, ఆ తర్వాత నికోలస్ పూరన్ (89), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (74)లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. పొలార్డ్ అయితే సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగులు తీసింది. జాసన్ హోల్డర్ 7 పరుగులు చేశాడు.

దీంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, షమీ, జడేజాలు చెరో వికెట్ తీశారు.

అనంతరం 316 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ రోహిత్‌శర్మ, లోకేశ్ రాహుల్, కోహ్లీల బాదుడుతో విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (63), లోకేశ్ రాహుల్ (77)లు విజృంభించారు.

తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించారు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరోమారు జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు.. వరుసపెట్టి వికెట్లు కోల్పోతున్న వేళ జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు.

228 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి విజయావకాశాలు సన్నగిల్లిన వేళ జడేజా(39)తో కలసి భారత శిబిరంలో ఆశలు నింపాడు. చివర్లో కోహ్లీ అవుటైనా శార్దూల్ ఠాకూర్(17) మెరుపులు మెరిపించాడు. సిక్సర్, రెండు ఫోర్లు బాది విజయావకాశాలను వన్ సైడ్ చేశాడు. జడేజా, శార్దూల్‌ కలిసి జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న కోహ్లీ సేన సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోమారు నిరూపించింది. 2019ని విజయంతో ముగించింది.

- Advertisement -