26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా భీమిలిని ప్రకటించడం వెనక కారణమిదే!

పరిపాలన రాజధానిగా భీమిలిని ప్రకటించడం వెనక కారణమిదే!

- Advertisement -

విశాఖపట్టణం: జిల్లాలోని భీమిలికి చారిత్రక ప్రాధాన్యముంది. దేశంలోనే రెండో మున్సిపాలిటీగా రికార్డులకెక్కింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న రెండో నియోజకవర్గం కూడా ఇదే. డచ్‌ వారి కాలంలో ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. స్మార్ట్‌ సిటీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పేరున్న విద్యాసంస్థలు, పరిశ్రమలకు నెలవు. అందుకే భీమిలి నియోజకవర్గాన్ని ఏపీ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

భీమిలి పరిపాలన రాజధాని అయితే అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలోని కాపులుప్పాడకు మహర్దశ పట్టబోతోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామంలో ఉన్న కొండ సుందరమైన ప్రదేశం. ఇక్కడ ఒకే సర్వే నెంబర్లో 3వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉంది.

ఈ ప్రాంతంలోని 1350 ఎకరాలను వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో యూనిటెక్‌ కంపెనీకి కేటాయించారు. ఆ కంపెనీ చేతులెత్తేయడంతో స్థలాన్ని వెనక్కి తీసుకున్నారు. అనంతరం అందులో కొంతస్థలాన్ని గత టీడీపీ ప్రభుత్వం అదానీ కంపెనీకి డేటా సెంటర్‌ కోసం కేటాయించింది. దీంతో కొండపైకి రహదారి నిర్మించారు.

కొన్నాళ్లకు అదానీ కంపెనీ కూడా పక్కకి తప్పుకోవడంతో ఇప్పుడా భూముల్ని వినియోగంలోకి తీసుకురావాలని జగన్ సర్కార్ భావిస్తోంది. వాటిని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా మార్చాలని నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పై ఈ నెల 27న జగన్ ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకోనుంది. ఆ రోజున భీమిలి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

- Advertisement -