హైదరాబాద్: భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరో తెలుసా? ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకుంటున్నారా? లేకపోతే క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నారా? వీళ్లెవరూ కాదు.. మహేంద్ర సింగ్ ధోని. అవును, భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్.. ధోనీయే. తాజాగా ఓ వెబ్ సైట్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఈ ఆన్‌లైన్ సర్వేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటికీ, ఎప్పటికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ధోనీది ప్రత్యేక స్థానమే. మహేంద్ర సింగ్ ధోని… పరిచయం అక్కర్లేని పేరు. భారత్ తరఫున ఏ కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో రెండు వరల్డ్‌కప్‌లు అందించాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని… ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెబుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తులెవరో తెలుసుకోవడానికి yougov.co.uk ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. సుమారు 40 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. తాజాగా ఆ సంస్థ ఫలితాలను వెల్లడించింది. భారత్‌లో అత్యధికంగా ఆరాధిస్తోన్న వ్యక్తుల్లో ధోని రెండో స్థానంలో నిలిచినట్లు సర్వే వెల్లడించింది. తొలి స్థానం పొందిన వ్యక్తి నరేంద్ర మోడీ.
ఈ సర్వేలో.. ధోని స్కోరు 7.7 శాతంగా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 11.9 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక, మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? అన్న విషయానికి వస్తే ధోని తర్వాత సచిన్ టెండూల్కర్ (6.8 శాతం) ఓట్లతో 6వ స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ (4.8 శాతం) ఓట్లతో 8వ స్థానంలో నిలిచాడు.
పస తగ్గినా.. పాపులారిటీ తగ్గలేదు…
ధోని బ్యాటింగ్‌లో పస తగ్గిందని, ఇంగ్లాండ్ పర్యటనలో అతడిపై విమర్శలు వచ్చినప్పటికీ ధోనికి ఉన్న పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఆన్ లైన్ సర్వే జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ గేట్స్, అమితాబ్ బచ్చన్… 3, 4, 5 స్థానాలను దక్కించుకున్నారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ముగ్గురు క్రీడాకారులు ధోని, సచిన్, కోహ్లీ మాత్రమే.
ఇక మహిళల విభాగానికి వస్తే కిరణ్ బేడీ(10.10) అగ్రస్థానంలో నిలవగా లతా మంగేష్కర్ (9.5) ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. ఒలింపిక్ పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు (6.9) మూడో స్థానంలో నిలిచింది.