23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home క్రికెట్ భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కూడా వర్షార్పణం…

భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కూడా వర్షార్పణం…

india vs newziland
- Advertisement -

ప్రపంచకప్‌: ప్రపంచ కప్‌ను నీడలా వెంటాడుతున్న వరుణ దేవుడు ఇండియా కి కూడా అడ్డుతగిలాడు. దీనితో గురువారం ఇక్కడ న్యూజిలాండ్‌తో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ రద్దయింది. ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. తొలుత తడిగా ఉన్న ఔట్‌ ఫీల్డ్, శీతల వాతావరణ ప్రభావంతో టాస్‌ ఆలస్యమైంది.

అరగంట తర్వాత సిద్ధమవబోతుండగా వాన ప్రారంభమైంది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇదేమంత అడ్డంకి కాకపోయేది. కానీ, మంగళ, బుధవారాల్లో నాటింగ్‌హామ్‌లో కురిసిన భారీ వర్షాలకు ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానం ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. దీనికి గురువారం వాన తోడవడం, ఎండ ఏమాత్రం లేకపోవడంతో మ్యాచ్‌ ఆడే వీల్లేకపోయింది. ‘

వచ్చారు… చూశారు… వెళ్లారు తరహాలో అప్పటికీ ఇంగ్లండ్‌ కాలమానం ప్రకారం 11.30కు, 12.30కు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చివరి సారిగా పరిస్థితిని సమీక్షించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్‌ల ద్వారా (మూడు విజయాలు, ఒక రద్దు) ఏడు పాయింట్లు సాధించిన న్యూజిలాండ్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ‘టాప్‌’లో ఉండగా, మూడు మ్యాచ్‌లాడిన భారత్‌ రెండు విజయాలు, ఒక మ్యాచ్‌ రద్దుతో ఐదు పాయింట్లతో మూడో స్థానానికి చేరింది.

గత మూడు ప్రపంచ కప్‌లలో భారత్, కివీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగలేదు. చివరిసారి 2003 కప్‌లో సెంచూరియన్‌ వేదికగా టీమిండియా నెగ్గింది. కప్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం ఏడు మ్యాచ్‌లు జరగ్గా భారత్‌ మూడు, కివీస్‌ నాలుగు గెలిచాయి. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో గురువారం మ్యాచ్‌ సాగి ఉంటే టీమిండియాకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది.

కీలక ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ దూరమైన నేపథ్యంలో కూర్పును పరీక్షించుకునే అవకాశమూ చిక్కేది. ఒక ప్రపంచకప్‌లో వర్షం వల్ల గరిష్టంగా రద్దయిన మ్యాచ్‌లు రెండు. అలాంటిది ఈసారి టోర్నీలో మూడో వంతు పూర్తయ్యేసరికే నాలుగు మ్యాచ్‌లు వరుణుడి ఖాతాలో చేరిపోయాయి.

- Advertisement -