
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కీపింగ్ గ్లోవ్స్ పై పారా మిలిటరీ బలగాల స్మారక చిహ్నం బలిదాన్ ఉండడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్లోవ్స్ పై బలిదాన్ గుర్తు ఉండడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
దీంతో ధోనీ నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బలిదాన్ చిహ్నంలేని గ్లోవ్స్ తో బరిలో దిగాడు. ఈ క్రమంలోనే ధోనీ మాదిరిగానే ఐసీసీ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్‌కి కూడా షాకిచ్చింది.
గేల్ బ్యాట్ మీద ‘యూనివర్స్ బాస్’ అనే చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నం ఉన్న బ్యాట్‌తోనే ఎంతో కాలంగా గేల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే ప్రపంచకప్‌లో కూడా గేల్ అదే బ్యాట్‌తో బరిలో దిగుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ లోగోని తొలగించాలని గేల్‌ని ఐసీసీ కోరింది. ఇది నాన్ కమర్షియల్ చిహ్నం కావడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు వినియోగించే వస్తువుల మీద ఎలాంటి రాజకీయ, మతపరమైన, జాతివిద్వేషపూరిత సందేశాలు ఉండకూడదు. అందుకే ధోనీ, గేల్‌కి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.








