టీమిండియాలో నాలుగో స్థానంలో నేను ఫిక్స్.. పైగా చక్కగా రాణిస్తున్నా: శ్రేయాస్ అయ్యర్

- Advertisement -

ముంబై: క్రికెట్ జట్టులో నాలుగో స్థానం చాలా కీలకం. అయితే భారత జట్టులో మాత్రం ఇటీవల ఈ స్థానం పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ స్థానం కోసం మొదట అంబటి రాయుడును పరిశీలించగా పర్వాలేదనిపించాడు. అయితే మళ్లీ అనూహ్యంగా వరల్డ్‌ కప్‌ టోర్నీకి నాలుగో స్థానానికి విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు.

కొన్ని ఇన్నింగ్స్ ఆడినప్పటికీ విజయ్ పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయాడు. అయితే టోర్నీ మొత్తం రోహిత్, రాహుల్, కోహ్లీలు రాణించడంతో ఈ నాలుగో స్థానంపై అంత ప్రభావం పడలేదు.

కానీ అత్యంత కీలకమైన సెమీ ఫైనల్‌లో మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు త్వరగా పెవిలియన్‌కు చేరడంతో భారం నాలుగో స్థానంలో వచ్చే ఆటగాడిపై పడింది.

ఆ  మ్యాచ్‌లో కూడా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విజయ్ శంకర్ ఏమాత్రం నిలదొక్కుకోలేకపోవడంతో చివరికి అతడు టోర్నీ నుంచి వెనుదిరగవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ తర్వాత జరిగిన పలు టోర్నీల్లో శ్రేయాస్ అయ్యర్‌ను నాలుగో స్థానం కోసం సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆ స్థానంలో అతడు గొప్పగా రాణిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇక ఎవరూ నాలుగో స్థానం గురించి ఆలోచించాల్సిన పని లేదని అయ్యర్ అంటున్నాడు. తాను ఆ స్థానంలో చక్కగా కుదురుకున్నానని, తన స్థానాన్ని సుదీర్ఘకాలం కాపాడుకోగలనని అయ్యర్ చెప్పాడు.

ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్‌లో…

ఇటీవల ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్‌లో పాల్గొన్న అయ్యర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

ఎవరైనా ఓ ఏడాదిపాటు ఒకే స్థానంలో ఆడుతుంటే అతడు ఆ స్థానంలో కుదురుకున్నట్లేనని, తాను నాలుగో నెంబరులో దాదాపు ఏడాదిగా ఆడుతున్నానని, చక్కగా రాణిస్తున్నానని అయ్యర్ వివరించాడు.

అయితే నాలుగో నెంబరులో మాత్రమే కాకుండా ఏ స్థానంలోనైనా తాను బ్యాటింగ్ చేయగలనని, ఆ సత్తా తనకుందని పేర్కొన్నాడు.

ఇప్పటివరకు 18 మ్యాచులు ఆడిన అయ్యర్ దాదాపు 50 పరుగుల సగటుతో బ్యాటింగ్ చేశాడు. అతడు బ్యాటింగ్ చేసిన 16 ఇన్నింగ్స్‌లలో 9 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ కూడా ఉంది.

- Advertisement -