మన దేశంలో సినిమాల తరువాత క్రికెట్ అంటేనే జనానికి పిచ్చి. అలాంటిది కరోనా వైరస్ విజృంభణ కారణంగా అటు సినిమా థియేటర్లు, ఇటు క్రికెట్ మ్యాచ్‌లూ బంద్ అవడంతో ప్రజలకు కాలక్షేపం కరువైంది.
కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోగా బుధవారం మళ్లీ టెస్ట్ క్రికెట్ మొదలవబోతోంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల నడుమ టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మొదలవనుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో మళ్లీ ఆరాటం మొదలైంది.
ఇళ్లలోని టీవీ సెట్ల ముందు కూర్చుని మ్యాచ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్‌లోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అంతా బయోబబుల్‌లో నిర్వహించనున్నారు.
అంటే స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. కేవలం ఇరు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు మాత్రమే మైదానంలో ఉంటారు. ఇలా ప్రేక్షకులు లేకుండా క్రికెట్ మ్యాచ్ జరగడం 143 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.
ఇక మ్యాచ్‌కు సంబంధించి పలు విషయాల్లోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే క్రికెటర్లకు బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. కరోనా బారిన పడకుండా వారంతా సురక్షిత వాతావరణంలో ఉంటున్నారు.
అలాగే బంతిపై ఉమ్మి రుద్దడాన్ని కూడా ఐసీసీ ఇప్పటికే నిషేధించింది. ఒకవేళ బౌలర్లు అలవాటులో పొరపాటుగా బంతిపై ఉమ్మి గనుక రుద్దితే తొలి తప్పు కింద అంపైర్లు క్షమిస్తారు.
అలా రెండుకన్నా ఎక్కువ సార్లు గనుక చేస్తే.. జరిమానా కింద ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు ఇస్తారు. క్రికెట్ మ్యాచ్ మధ్యలో డ్రింక్స్, టీ, భోజనానికి విరామాలు ఉండటం మామూలే.
అయితే కరోనా నేపథ్యంలో కొత్తగా శానిటేషన్ విరామం కూడా వీటికి తోడైంది. అంటే.. ఆట మధ్యలో క్రికెటర్లు అందరూ హ్యాండ్ శానిటైజర్లు విధిగా వాడాల్సి ఉంటుంది. వారు ఉపయోగించే వస్తువులను కూడా శానిటైజ్ చేస్తారు.
బాల్ బాయ్స్‌గా రిజర్వ్‌డ్ ఆటగాళ్లే ఉంటారు. అలాగే ప్రత్యక్ష ప్రసారాలు అందించే వారు కూడా పీపీఈ కిట్లు ధరించాల్సిందే.