
బర్మింగ్ హామ్: ఎట్టకేలకు ప్రపంచ కప్ 2019లో కోహ్లీ సేన సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో మంగళవారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరికి టీమిండియా 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించడమేకాక, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు సెమీస్‌కు చేరిన తొలి ఆసియా జట్టుగా ఘనత సాధించింది.
నిజానికి బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ తీరా మైదానంలోకి దిగాక బంగ్లా జట్టు కూడా అద్భుతంగా పోరాడింది. ఓ దశలో విజయం ఇరు జట్ల వైపు దోబూచులాడింది.
మ్యాచ్‌ను తిప్పేసిన భారత బౌలర్లు…
అయితే భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోగలిగారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓ దశలో బంగ్లా జట్టులోని టెయిలార్డర్ బ్యాట్స్ మెన్ టీమిండియాను భయపెట్టారు. అయితే బుమ్రా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో భారత జట్టు విజయం ఖాయమైంది.
తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత జట్టు 314 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ (104) రికార్డు సెంచరీకి తోడు రాహుల్ (77) రాణింపుతో పోరాడే స్కోరు అందుకున్న భారత్.. ఆ తరువాత బంగ్లాదేశ్ జట్టు పనిపట్టింది.
బుమ్రా (4/55), హార్దిక్ పాండ్య (3/60) విజృంభణతో మరో మ్యాచ్ మిగిలుండగానే ప్రపంచ కప్ 2019లో టీమిండియా నాకౌట్ బెర్తు దక్కించుకుంది.
రిషభ్ పంత్ (48; 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), ధోని(35; 33 బంతుల్లో 4 ఫోర్లు)తో కాస్త ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్‌కు 5 వికెట్లు దక్కగా, షకిబుల్, రుబెల్, సౌమ్య సర్కార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత టీమిండియా నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి బంగ్లాదేశ్ జట్టు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేక పోయింది.
286 పరుగులకే కుప్పకూలిన బంగ్లా…
48 ఓవర్లలో 286 పరుగులకే బంగ్లా జట్టు కుప్పకూలిపోయింది. టీమిండియా నిర్దేశించిన లక్ష్య ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు షకీబుల్(66), సైఫుద్దీన్(51 నాటౌట్) మినహా మిగిలిన వారెవరూ పెద్దగా రాణించలేదు.
అంతేకాకుండా కీలక సమయాల్లో షబ్బీర్(33), సౌమ్య సర్కార్(33), రహీమ్(24), లిట్టన్ దాస్(22)లు వికెట్లు చేజార్చుకోవడం టీమిండియాకు బాగా కలిసొచ్చింది.
మొత్తంమీద రోహిత్ సెంచరీ చేయడం, భారత బౌలర్లలో బుమ్రా(4/55), హార్దిక్ పాండ్యా(3/60)లు బంగ్లా పతనాన్ని శాసించడంతో టీమిండియా బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలోనే రెండ్రోజుల క్రితం ఇంగ్లాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. తిరిగి మంగళవారం అదే మైదానంలో బంగ్లాదేశ్‌ను ఓడించి.. పాయింట్లను 13కు పెంచుకుని పట్టికలో రెండో స్థానానికి చేరి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.








