

న్యూఢిల్లీ: ఇంగ్లండ్, వేల్స్ వేదికగా త్వరలో జరిగే ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరిగే అవకాశాలు లేనట్టేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖుడొకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. భారత ప్రభుత్వం అంగీకరించని పక్షంలో దాయాది దేశాల మధ్య మ్యాచ్ జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఒకవేళ ఈ టోర్నమెంటులో పాకిస్తాన్‌తో భారత్ ఆడేందుకు అంగీకరించకపోతే… మ్యాచ్‌లో పాల్గొనక పోయినా పాకిస్తాన్‌కు పాయింట్లు దక్కే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. కాగా ఈ వ్యవహారంపై బీసీసీఐ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో సంప్రదింపులు జరపలేదని సదరు ఉన్నతాధికారి పేర్కొన్నారు.
‘‘భారత్ ఆడకపోతే పాకిస్తాన్ గెలిచే అవకాశం…’’
‘‘మరో మూడు నెలల్లో జరగనున్న వరల్డ్ కప్‌కు ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు ఐసీసీ కూడా చేయడానికేం లేదు. వరల్డ్ కప్‌కు ముందు ఎప్పుడైనా భారత ప్రభుత్వం ఈ మ్యాచ్ ఆడవద్దని చెబితే మేము ఆడడానికి లేదు. అయితే మనతో తలపడకపోయినా పాకిస్తాన్ పాయింట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే గనుక ఫైనల్ మ్యాచ్ అయితే.. మ్యాచ్ ఆడకుండానే పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలుచుకుంటుంది…’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 27న దుబాయ్‌లో ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల గురించి చర్చించే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, సెక్రటరీ అమితాబ్ చౌదరి పాల్గొననున్నట్టు తెలుస్తోంది








