వాట్ ఎ గ్రేట్ సాంగ్: 65 మంది సింగర్లు.. 5 భాషలు.. ఒక పాట! రిలీజ్ బై మెగా పవర్‌స్టార్…

- Advertisement -

హైదరాబాద్: 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశమంతా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్న వేళ.. మరో అద్భుతం చోటు చేసుకుంది. 

స్వాతంత్ర్య వేడుకలను ఏటా అత్యంత ఘనంగా జరుపుకునే వాళ్లం. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా.. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ.. నిరాడంబరంగా జరుపుకోవాల్సి వచ్చింది. 

అయితే భారతీయుల దేశభక్తిని ఏ లాక్‌డౌన్లూ తగ్గించలేవు.. ఏ నిబంధనలూ వర్తించవు.  మనసుంటే మార్గం ఉంటుందని మన సినీ నేపథ్య గాయకులు నిరూపించారు.

65 మంది సింగర్లు.. 5 భాషల్లో.. అందరూ ఒక్కటై ఒక పాటను ఆలపించారు. అది ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోజా’ చిత్రంలోని పాట.

ఈ పాటకు తెలుగులో రాజశ్రీ సాహిత్యం అందించగా, తమిళంలో వైరముత్తు, హిందీలో పీకే మిశ్రా, మలయాళంలో గోపాలకృష్ణన్‌లు ఈ పాటను రచించారు. 

ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ‘వినరా.. వినరా.. దేశం మనదేరా’ అనే ఈ పాటను ఐదు భాషల్లో.. అరవై ఐదు మంది గాయకులు, గాయనీమణులు తమ ఇళ్లలోనే ఉండి ఆలపించారు.

ఆ వీడియోలను ఒక్కటిగా కూర్చి ‘టుగెదర్ యాజ్ వన్’ పేరుతో తీర్చిదిద్దిన ఈ పాటను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. పాట విడుదల అనంతరం ఇది తనకెంతో ఆనందం కలిగిస్తోందని ఆయన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇది మనలోని ఏకత్వాన్ని చూపిస్తోందని, ఒక ముఖ్యమైన కారణం కోసం 65 మంది సింగర్లు కలిసి ఒక పాటను పాడటం విశేషమని పేర్కొన్నారు.

ఈ క్లిష్ట సమయంలో అందరం ఒక్కటే అంటూ ఐకమత్యం చాటడానికి ఇంత మంది సింగర్స్ కలిసి పని చేయడం ఆనందంగా ఉందని రామ్ చరణ్ తెలిపారు.

మరి ఇంత గొప్ప ఈవెంట్‌ను మీరు తిలకించాలి కదా! ఆ పాటను మరోసారి విని మైమరచిపోవాలి కదా!!

 

 

- Advertisement -