34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘మా’ ఎన్నికలు: అధ్యక్షుడిగా నరేష్‌, ప్రధాన కార్యదర్శిగా జీవిత విజయం!

‘మా’ ఎన్నికలు: అధ్యక్షుడిగా నరేష్‌, ప్రధాన కార్యదర్శిగా జీవిత విజయం!

- Advertisement -

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌(మా) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. తీవ్ర ఉత్కంఠ నడుమ ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించినట్లు ప్రకటించారు. నరేష్‌కు 268 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి శివాజీ రాజాకు 199 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ పూర్తికాగా.. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడవచ్చని తొలుత అందరూ భావించారు. అయితే సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతం వరకు కౌంటింగ్ కొనసాగింది. దీంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  గత ‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించడంతో ఫలితాలు త్వరగా వెలువడ్డాయి.

బ్యాలెట్ పత్రాలతో ఫలితాలు ఆలస్యం…

అయితే ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం వల్ల వాటి లెక్కింపు బాగా ఆలస్యమైంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ సాగిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటింగ్ నమోదయింది. ఇది కూడా ఫలితాల్లో ఆలస్యానికి కొంతవరకు కారణం కావచ్చు.

ఇక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో శ్రీకాంత్‌పై.. రాజశేఖర్ గెలుపొందగా, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబుపై జీవిత గెలుపొందారు. గత ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ నుండి ఈసీ మెంబ్‌గా పోటీ చేసిన నటి హేమ.. ఈసారి ఉపాధ్యక్షురాలి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం విశేషం. ఇక సంయుక్త కార్యదర్శిగా బిగ్‌బాస్ 1 విజేత శివబాలాజీ గెలిచారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో దాదాపు 800 మంది వరకు నటీనటులు సభ్యులు ఉన్నారు. 2015లో ‘మా’కు జరిగిన ఎన్నికల్లో 394 ఓట్లు మాత్రమే నమోదుకాగా.. 2017లో జరిగిన ఎన్నికలు మాత్రం ఏకగ్రీవం అయ్యాయి.

అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం రికార్డు స్థాయిలో 472 ఓట్లు నమోదు అయ్యాయి. మొత్తం మీద నువ్వా-నేనా అంటూ పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించడంపై ఆ వర్గంలో ఆనందం వ్యక్తమవుతోంది.

గెలుపు వివరాలు ఇలా…

పదవి                          గెలిచిన వారు             ఓడిన వారు
ప్రెసిడెంట్                      నరేష్                     శివాజీ రాజా
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్     రాజశే్ఖర్                శ్రీకాంత్‌
జనరల్ సెక్రటరీ                జీవిత రాజశేఖర్         రఘుబాబు
జాయింట్ సెక్రెటరీ              శివ బాలాజీ              గౌతమ్ రాజు
ట్రెజరర్‌                         రాజీవ్ కనకాల          కోట శంకర్రావు

గెలిచిన ఈసీ మెంబర్లు…

1) అలీ 2) రవిప్రకాష్ 3) తనికెళ్ల భరణి 4) సాయికుమార్ 5) ఉత్తేజ్ 6) పృథ్వి 7) జాకీ 8) సురేష్ కొండేటి 9) అనితా చౌదరి 10) అశోక్ కుమార్ 11) సమీర్ 12) ఏడిద శ్రీరామ్ 13) రాజా రవీంద్ర 14) తనీష్ 15) జయలక్ష్మి 16) కళ్యాణి 17) వేణుమాధవ్ 18) పసునూరి శ్రీనివాస్

‘మా’ ఎన్నికల్లో పోటీ చేసిన నరేష్ ప్యానల్

Maa Elections 2019 - Naresh Panel

‘మా’ ఎన్నికల్లో పోటీ చేసిన శివాజీ రాజా ప్యానల్

MAA Elections 2019 - Shivaji Raja Panel

- Advertisement -