
హైదరాబాద్: మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చేస్తోన్న పలు ట్వీట్లు వివాదాస్పదంగా మారుతున్నాయి.
మొన్నటికి మొన్న గాడ్సేను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్లు చేయగా.. తాజాగా కరెన్సీ నోట్లపై ఆయన కామెంట్లు చేశారు.
ముఖ్యంగా జాతిపిత గాంధీని టార్గెట్ చేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో.. కొందరు ఫైర్ అవుతున్నారు.
నాగబాబు తన ప్రవర్తనను మార్చుకోవాలంటూ కొందరు రాజకీయ నేతలు కూడా మండిపడ్డారు. కాగా నాగబాబు వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ స్పందించారు.
ఈ మేరకు వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదు అంటూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
”జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నా.
గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని మీకు తెలిపాం. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున మరోసారి ఆ విషయాన్ని మీకు విశదీకరిస్తున్నాను.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.
పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికార పత్రం ద్వారా, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నాము.
వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరికీ ఒక మాట చెబుతున్నా.
ఇది ప్రజలు అనుకోని కష్టాలను ఎదుర్కొంటున్న కాలం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరేతర అంశాల జోలికి వెళ్లొద్దని కోరుతున్నా. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విఙ్ఞప్తి చేస్తున్నా” అని తన ప్రకటనలో పవన్ తెలిపారు.








