మీకు ఆ హక్కు ఉంది: ‘యాత్ర’ నెగెటివ్ టాక్‌పై డైరెక్టర్ స్పందన!

5:47 pm, Fri, 8 February 19
yatra director responce on reviews

yatra

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు ‘యాత్ర’ సినిమా బావుందంటే, మరికొందరు బాగోలేదనే అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

‘యాత్ర’ సినిమాకు పాజిటివ్, నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తుండటంపై దర్శకుడు మహి వి రాఘవ్ స్పందించారు. ట్విట్టర్లో వస్తున్న కామెంట్లకు ఆయన ఓపికగా రిప్లై ఇచ్చారు. యాత్ర సినిమా పై ఇలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది అని ముందే ఊహించిన ఆయన తన సమాధానం ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారు.

‘‘ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టి యాత్ర సినిమా చూస్తున్నారో, వారందరికీ ఈ చిత్రంపై తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉంది. మా సినిమా చూసిన వారందరికీ ధన్యవాదాలు..’’ అంటూ మహి వి రాఘవ్ ట్వీట్ చేశారు.

‘యాత్ర’ సినిమాపై వస్తున్న పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వినమ్రంగా, నిజాయితీగా స్వీకరిస్తాం. ఒక సినిమాపై అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవని నా భావన అంటూ యాత్ర దర్శకుడు తనదైన శైలిలో హుందాగా స్పందించారు . అలాగే మరికొందరు మాత్రం సినిమా సూపర్‌ సార్.. మీరు బాధపడకండి అంటూ డైరెక్టర్‌కి మద్దతు తెలిపారు.