
హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఆపార్టీకి కేవలం ఒకటే సీటులో గెలిచింది. ఇక పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో పవన్ ఓటమిపై సినీ నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… వాస్తవానికి పవన్ ఎంతో సున్నితమైన వ్యక్తి అని చెప్పారు. ఆయనలో భావోద్వేగాలు మెండుగా ఉంటాయని, ఈ విషయం ప్రజలకు తెలియడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు.
అయితే పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తానేంటో ప్రజలకు వివరించడానికి ఆయనకు పెద్దగా సమయం సరిపోలేదని చెప్పారు. మరో ఐదేళ్లలో పవన్ సిద్ధాంతాలను ప్రజలు మరింతగా అర్థం చేసుకుంటారని చక్రవర్తి అభిప్రాయపడ్డారు.
ఇక సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన ఏదీ లేదన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఎదురైన పరిస్థితే, అప్పట్లో చిరంజీవి కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. ఉన్న కొద్ది వ్యవధిలో ప్రజలు వాళ్ల అంతరంగాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారని వివరించారు.








