వాట్ నెక్స్ట్? వచ్చే ఐదేళ్లలో ‘సాక్షి’ దినపత్రిక నెంబర్ 1 కావాలి… అంతే!

ys-jagan-sakshi-daily
- Advertisement -

ప్రజా పాలనపై నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి…
అదే స్ఫూర్తితో సాక్షి దిన పత్రికను ముందుకు తీసుకెళ్లాలనే సంకేతాలు… 
సాక్షి మీడియా సిబ్బంది అప్రమత్తం… 
అవసరమైతే ఇతర పత్రికల్లో సీనియర్లకు పిలుపులు వస్తాయంటున్న సంపాదకీయ వర్గాలు…

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అడుగులు పక్కా ప్రణాళికాబద్ధంగా వేస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను చూసిన అనుభవం.. ఆయనకు అక్కరకు వచ్చినట్టే కనిపిస్తోంది. ఎక్కడా తొణుకు లేదు.. బెణుకు లేదు..ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రమాణస్వీకారమైన  పదిరోజుల్లోనే ఒక సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో, అటు మేధావుల్లో కల్పించడంలో సఫలీకృతమయ్యారు.

ఆయన ప్రజాపాలనను ఎంత సమర్థవంతంగా చేయవచ్చో చాలా చక్కగా చేసి చూపిస్తున్నారు. ఇప్పుడదే స్ఫూర్తి సాక్షి పత్రిక, ఛానల్ మీడియా సిబ్బందిలో వ్యక్తమవుతోంది. మనం కూడా మన నాయకుడు లాగే మన సొంత పత్రిక సాక్షిని.. వచ్చే ఐదేళ్లలో నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లాలి అనే కృతనిశ్చయంతో ఉన్నారు.

అందుకే పైస్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు ఏం చేయవచ్చో.. ప్రణాళికలు రచిస్తున్నారు. అంతా పకడ్బందీగా పత్రికను తీసుకురావాలనే దృడసంకల్పాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతా జగన్మోహనరెడ్డి పరిపాలనకు ముగ్ధులవుతుంటే.. అవి చూసి సిబ్బంది.. ఒక గొప్ప  ఆత్మ విశ్వాసంతో బయట తిరుగుతున్నారు.

అలాగే తమ ప్రియతమ ముఖ్యమంత్రికి సాక్షి పత్రికని నెంబర్ వన్ చేసి..ఆయనకు ఆనందం కలిగించాలని భావిస్తున్నారు. ఇంతకన్నా తమ నాయకుడికి ఇచ్చే గొప్ప బహుమతి ఏముంటుంది అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్ ప్రస్థానంలో ‘సాక్షి’ పాత్ర

నిజానికి ఈరోజున ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రస్థానంలో సాక్షి పత్రిక, ఛానల్ పాత్ర మరువలేనిది. నిజానికి ఆ పత్రిక , చానల్ లేకుంటే..ఈరోజున బహుశా జగన్ జైలు నుంచి బయటకు వచ్చేవారో లేదో కూడా తెలీదు. అందరూ అనుకున్నట్టు ఆ లక్ష కోట్లు తినేశాడు అనే అపప్రధ ఆ వైఎస్ కుటుంబంపై అలాగే ఉండేదనేది సత్యం.. ఇంతకన్నా గొప్ప మాటేమిటంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరకంగా ప్రజల దృష్టిలో దేవుడయ్యాడు.

ఆయనలాగే ఈ తొమ్మిదేళ్లు ఉన్నాడంటే..అది సాక్షి పత్రికవల్లే అని చెప్పాలి. లేదంటే జనం ఎప్పుడో ఆయన్ని మరిచిపోదురు. అలాగే లక్ష కోట్లు తినేశాడు అనే ముద్ర జగన్ పై అలాగే ఉండేది..రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులు కట్టి ధనయజ్నం చేశాడు..అవినీతి పరుడనే ముద్ర దాంతో అలాగే ఉండేది.

అలాగే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నాడు చేసిన పాదయాత్ర కవరేజ్ కూడా ఎక్కడో ఒక మూలన చిన్న సింగిల్ కాలమ్ వార్తగా వచ్చేది. ఎన్నికల ప్రచారంలో ఆయన కనిపించేవారే కాదు.. నిజానికి ఈరోజున మళ్లీ పార్టీ పునరుత్తేజం పొంది.. 1000 కిమీ పాదయాత్రను ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ.. జనంలోకి తీసుకెళ్లిన పత్రిక, ఛానల్ ఈరోజున జగన్ కి రెండు కళ్లు అని చెప్పాలి.

ఐదేళ్ల తెలుగుదేశం అవినీతిపాలనపై ఎండగట్టిన ‘సాక్షి’

ఈరోజున సాక్షి పత్రికలో వచ్చిన ఎన్నో తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములను తమ సామాజిక వర్గంలో బడాబాబులకి వందల ఎకరాలు కట్టబెట్టడాన్ని ఆధారాలతో సహా నిరూపించింది..

రైతుల దగ్గర అతి తక్కువ ధరకి కొని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తెలుగుదేశం పార్టీ నేతలకు భూ సంతర్పణ చేసిన విధానాన్ని అడుగడుగునా ఎండగట్టింది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు కమీషన్ల కోసమే  కడుతున్నారంటూ తూర్పారబెట్టింది.

‘ఏది నిజం’ శీర్షిక.. ‘సాక్షి’కి వెన్నెముక

’ఏది నిజం‘ అంటూ.. ప్రధాన పత్రిక వండి వార్చిన వార్తల కథనాల్లో కుట్రకోణాన్ని ఎండగట్టి..ప్రజలకు వివరించింది పత్రిక..అసలు ఆ శీర్షిక.. సాక్షికి వెన్నుముక అని చెప్పాలి.   సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగన్ కేసుల విషయంలో తాము పట్టుకున్నవి కేవలం 1500 కోట్లేనని చెప్పడంతో మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నివ్వెరపోయాయి.

నిజానికి వార్తలతో ప్రజల మనసులను ఎలా కలుషితం చేయవచ్చు..అనేదానికి నిదర్శనం. ఆ పత్రికల తీరని చెప్పాలి. అసలు లక్ష కోట్లని ఎలా రాసేశాయి..ఎంత నిస్సిగ్గుగా రాశాయి..అని బహిరంగంగానే నెటిజన్లు సోషల్ మీడియాలో ఆ పత్రికలు, ఆ విలువల్లేని రాతలను ఎండగట్టాయి. ఇలా ఎన్నో ఆవేదనలు, అవమానాలు, ఆక్రోశాల మధ్యన జగన్మోహనరెడ్డికి అండగా నిలిచిన సాక్షి పత్రిక ఒక గుండె కాయ అని చెప్పాలి.

ప్రజా పాలనలోనే కాదు.. జర్నలిజంలో కూడా విలువలు పెరగాలి

అందుకే తను యావత్ ఆంధ్ర రాష్ట్రంలో పాలనలో విప్లవాత్మకమైన మార్పులను ఎలా చేస్తున్నారో.. కుళ్లు, కుతంత్రాలను ఎలా కడిగేస్తున్నారో.. అలాగే పత్రికారంగంలో కూడా ఒక వినూత్నమైన నూతన జర్నలిజపు విలువలకి.. సాక్షి పత్రిక నిలవాలని, నెంబర్ 1 స్థానం పొందాలని.. జర్నలిజం పేరు చెబితేనే ప్రజల్లో  పేరుకుపోయిన వ్యతిరేక భావాన్ని తొలగించేందుకు.. ఏం చేయాలని.. సంస్థలో అంతర్గతంగా ఒక మేథోమథనం జరుగుతోంది.

నాడు ‘సాక్షి’ పత్రికే బతికించింది..

ఆరోజు సాక్షి పత్రిక పెట్టి..ఎందరో సబ్ ఎడిటర్లకు, పత్రికా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఎంతో మేలు చేసి ఆ కుటుంబల జీవితాల్లో వెలుగులు నింపిన సాక్షి మళ్లీ ఆ రోజులను తీసుకువస్తుందని సీనియర్ జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఒక ప్రముఖ పత్రికా సంస్థలో ఒక సీనియర్ సబ్ ఎడిటర్ కి నెలకి పదివేలు ఇచ్చే ఆ రోజుల్లో సాక్షి పత్రిక పెట్టడంతో.. అతని జీతం రూ.50వేలు దాటిపోయింది. అంటే అన్నాళ్లూ.. అతి తక్కువ జీతాలిచ్చిన ఆ ప్రధాన పత్రిక  తీరుపై అంతా గగ్గోలు పెట్టారు. మళ్లీ ఆ రోజులు రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

సాక్షి పత్రిక పటిష్టతకు ఇతర ప్రధాన పత్రికల్లో ఉపసంపాదకులకు, అవసరమైతే విశ్రాంత సీనియర్ జర్నలిస్టులకు అవకాశాలు ఉంటాయని.. అజయ్ కల్లాం ని తెచ్చుకున్నట్టే వీరిని తీసుకువస్తారనే ప్రచారం..మీడియా  సంస్థల్లో జోరుగా సాగుతోంది.

‘సాక్షి’పై బురద తొలగించాలి

అయితే అన్ని మీడియా సంస్థలపై ఉన్నట్టే ‘సాక్షి’పై కూడా అవినీతి బురద ఉంది. పక్షపాత ధోరణి చూపిస్తారని, రాజకీయంగా రికమండేషన్లు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయనే ప్రచారం ఉన్న నేపథ్యంలో అటు ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రికి చెడ్డ పేరు రాకుండా నిష్పక్షపాతంగా సిబ్బంది కూడా వ్యవహరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే అందరి కళ్లూ ఇప్పుడు జగన్ పైనే.. ఎప్పుడు.. ఎక్కడ.. చిన్న తప్పు అయనా జరగకపోతుందాని.. కాచుకొని కూర్చున్నారు.

ఒకవేళ ఆయన తప్పుకి దొరక్కపోతే ఏం చేస్తారు.. ఆ సిబ్బందిని టార్గెట్ చేస్తారు..వాళ్లు మంత్రులు కావచ్చు..ఎమ్మెల్యేలు కావచ్చు.. సాక్షి మీడియా సిబ్బంది కావచ్చు.. అందువల్ల అందరికి ఇది కఠినమైన బాటే.. ఇన్నాళ్లూ ఏసీ గదుల్లో సులువుగా నడిచిన వారికి..ఈ రాళ్ల బాట కొంత కష్టం కావచ్చు.. అయితే నాయకుడి అడుగుజాడల్లో నడవక తప్పదు.. చివరిగా..

ఇక్కడ చిన్నవిషయం చెప్పుకోవాలి..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో తిరిగితే ఎన్నిపత్రికలు ఆయన వార్తను వేశాయి? ఈ రోజున పవన్ కల్యాణ్ చెప్పే మాటేమిటంటే ‘‘నేను కూడా ఒక పత్రికను ప్రారంభిస్తాను. మాకంటూ ఒక పత్రిక లేకపోవడం కూడా మా పార్టీ పరాజయానికి ఒక కారణం..’’

చెప్పడమేకాదు, ఆ దిశగా పవన్ కసరత్తు కూడా ప్రారంభించారు. ‘‘మా పార్టీకి ఓట్లేసిన ప్రజలు మా పత్రికను కొంటే చాలు.. దానిని సమర్థవంతంగా నడిపించగలం..’’ అని మంగళగిరిలో ఎన్నికల సమీక్ష సమావేశంలో పవన్ చెప్పడం కూడా రాజకీయాల్లో.. అందునా రాజకీయ పార్టీలు సొంత పత్రికకు ఇస్తోన్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికా రంగంలో నెలకొనబోయే తీవ్ర పోటీ నడుమ ‘సాక్షి’ యాజమాన్యం, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించక తప్పదు.

- Advertisement -