సినిమా హీరోయిన్ ని ఓ సాదా సీదా కుర్రాడు ప్రేమిస్తే? యస్… ప్రేమిస్తే ఏమౌతుంది..? ఆ కుర్రాడికి, ఆ హీరోయిన్‌కు పెళ్లవుతుంది…కాకపోతే విడివిడిగా! దేశం మొత్తం మీద .. రోజూ చాలా మంది కుర్రాళ్లు రెగ్యులర్ గా హీరోయిన్స్ తో ప్రేమలో పడుతూనే ..లేస్తూనే, వాళ్లను ఊహించుకుంటూ కలలు కంటూనే ఉంటారు. సినిమా పోస్టర్ మారినప్పుడల్లా .. వాళ్ల ప్రేమ కథలో హీరోయిన్‌ను మారుస్తూంటారు. ఇది రొటీన్ .. ఇందులో వింతేముంది అంటారా…? ఉంది. ఓ కుర్రాడు మాత్రం ఓ హీరోయిన్‌తో ప్రేమలో పడి..ఆమెనే తన జీవితంలోకి ఆహ్వానించాడు.. అదెలా అంటే..
అనగనగా హైదరాబాద్‌లో విజయకుమార్ అనే కుర్రాడు. ఏదో ఒక హీరోకు అభిమానిగా మారి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టుకుంటూ కాలక్షేపం చేయాల్సిన వయస్సు. ముఖ్యంగా తెలుగువాడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా.. అతనికి ఎందుకనో కానీ చిన్నప్పటి నుంచీ సినిమా అంటే గిట్టదు. ముఖ్యంగా సినిమావాళ్లంటే ఓ విధమైన చిన్నచూపు.. వాళ్లంతా ఫేక్ మనుష్యులని ఓ గట్టి నమ్మకం… ఆ నమ్మకం అతనిలో ఎందుకు మొదలైందో , ఏ సినిమా వాళ్లు అతనిలో అలాంటి ఆలోచనలు కలిగించారో కానీ, పెంచి పోషించిన నమ్మకాన్ని అర్దాంతరంగా వదిలేయటం ఎందుకు అని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో వాళ్ల నాన్న (నరేష్)కు సినిమాలంటే పిచ్చి, పైగా ఏనాటికైనా సినిమా నటుడు అవ్వాలనేది జీవితాశయం.
తన జీవితాశయాన్ని నెరవేర్చుకునే భాగంలో ఓ సినిమా షూటింగ్ కు తన ఇల్లు ఫ్రీగా ఇచ్చి, తనకో వేషం ఇవ్వమని బేరం పెడతాడు. వాళ్లు ఓకే అని ఓ ఇరవై రోజులు షూటింగ్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు. ఆ క్రమంలో ఆ ఇంటికి ఆ సినిమాలో హీరోయిన్ గా చేసే అమ్మాయి…సమీరా రాథోడ్(అదితిరావు హైదరి) వస్తుంది. సమీరా కు తెలుగు సరిగ్గా రాదు. సర్లే కుర్రాడు బాగున్నాడు..ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని ..అతన్ని..తనకు తెలుగు డైలాగులు నేర్పమని అడుగుతుంది.
అలా మన యంగ్ తరంగ్ కి …ఆ హీరోయిన్ తో కాస్తంత దగ్గరగా మసిలే అవకాసం వస్తుంది. అంత దగ్గరగా వెళ్లాక మనస్సు దూరం ఎందుకు అవుతుంది. సినిమా వాళ్లపై తనకున్న అభిప్రాయాలన్ని కొద్ది సేపు ప్రక్కన పెట్టి.. ఆమెతో అమాంతం ప్రేమలో పడిపోతాడు. ఈ లోగా షూటింగ్ పూర్తై ఆమె వెళ్లిపోతుంది. అప్పుడు విజయకుమార్ తన ప్రేమ విజయం కోసం ఏం చేసాడు… ఆమె కూడా అతనితో ప్రేమలో పడిందా.. వంటి విషయాలు మెల్లిగా తెరపై చూసి తెలుసుకోవాల్సిన సంగతులు.
సమ్మోహపరిచిందా..?
సినిమా చాలా రియలస్టిక్ గా ఉండేలా డైలాగులు, కెమెరామూవ్ మెంట్స్, నటన వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు. అయితే మరీ రియల్ టైమ్ స్టోరీ లా స్లో గా నడపటమే కాస్తం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే ఫస్టాఫ్ ..హీరోయిన్ తో లవ్ సీన్స్ , నరేష్ ఫన్ తో సరదాసరదాగా గడిచిపోయినా సెకండాఫ్ కు వచ్చేసరికి … ఆ జోరు..ఉషారు తగ్గిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ ప్లాష్ బ్యాక్ …అందులో సమస్య..దాన్ని హీరో డీల్ చేసే విధానం ఇప్పటికే కొన్ని వందల సార్లు తెరపై చూసిందే కావటం రొటీన్ సీన్స్ చూస్తున్నట్లు అనిపించింది. హీరో లవ్ ని ఏక్సెప్ట్ చేయటానికి హీరోయిన్ కు వచ్చే సమస్య కొద్దిగా కొత్తగా ఉన్నా సీన్స్ కొత్తగా వచ్చి సినిమా ఇంకా బాగుండేది. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే విసుగెత్తించింది. దాంతో సమ్..మోహనమే అనిపించింది.
స్క్రీన్ ప్లేనే సమస్యా?
రొమాంటిక్ కామెడీ నేరేషన్ లో మొదలైన ఈ సినిమా. కాసేపటికి ఓ థ్రిల్లర్ మోడ్ కు వెళ్లింది..కేవలం హీరో వైపు క్యారక్టర్ ఓపెన్ చేసి, హీరోయిన్ వైపు మూసేసారు. దాంతో ఆమె వైపు ఉన్న సమస్య ఏమిటో అర్దం కాదు. పోనీ ప్లాష్ బ్యాక్ లో చెప్పిన హీరోయిన్ బోయ్ ప్రెండ్ సమస్యనే సినిమాలో కాంప్లిక్ట్ పాయింట్ అనుకుంటే క్లైమాక్స్ దాకా ఆ కాంప్లిక్ట్ ని దాచి ఉంచకూడదు. ఇంటర్వెల్ కు అయినా ఓపెన్ చేసేయాలి. అయితే అది ఈ కథకు కాంప్లిక్ట్ కాదు..హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే భావాత్మక సంఘర్షణే కాంప్లిక్ట్ అయ్యి ఉండాల్సింది.
‘నాటింగ్ హిల్’కి కాపీనా?
ఈ సినిమా ప్రారంభమైననాటి నుంచీ Notting Hill (1999) కి కాపీ అంటూ ప్రచారం జరిగింది. నిజానికి ఆ సినిమాకి ఈ సినిమాకి నేపధ్యం ఒకటే కానీ కథనం నడిపిన తీరు వేరు. అంటే ప్రేరణ పొంది ఉండవచ్చు కానీ కాపీ కొట్టలేదు.
ఈ బ్యాచ్ అంతా ఎలా చేశారంటే…
పి.జి.విందా కెమెరా వర్క్ సినిమాకు హైలెట్. ముఖ్యంగా హీరో,హీరోయిన్ ల మధ్య టెర్రస్ నేపథ్యంలో సాగే సీన్, పాటలు కలర్‌ఫుల్‌గా తెరకెక్కించారు. వివేక్ సాగర్ కూల్ గా వినసొంపుగా ఉంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడిగా కన్నా డైలాగు రచయితగా అదరకొట్టారు.నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు..నటుగా తెరపై కనిపించారు. అదితి హైదరీ లేకపోతే ఈ సినిమానే లేదు. సినిమా పిచ్చి ఉన్న తండ్రిగా నరేష్… సినిమాకు బాగా ప్లస్ అయ్యారు.
స్పెషల్లీ మెన్షన్..
సినిమాలో మొదటి నుంచీ చివరి వరకూ కాదంబరి కిరణ్ లీడ్ చేస్తారు. ప్రొడక్షన్ మేనేజర్ గా ఆయన చేసిన పాత్ర సినిమా పరిశ్రమలో చాలా మంది చాలా సార్లు చూసిందే. అంత నాచురల్ గా ఆ పాత్రలో జీవించారు.
ఫైనల్ థాట్ ఏమిటంటే…
ఇది మల్టిప్లెక్స్ సినిమా అని పబ్లిసిటీలో వేసేస్తే జనం ఇది ఏ తరహా సినిమానో అర్దం చేసుకుని వాళ్లే వెళ్తారు కదా..అప్పుడు స్లోగా ఉంది..క్లాస్ గా ఉంది అనే టాక్‌లు రావు కదా..
ఇదే టీమ్…
నిర్మాణ సంస్థ: శ‌్రీదేవి మూవీస్
తారాగణం: సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, సీనియర్ నరేశ్, పవిత్రా లోకేష్, , తనికెళ్ల భరణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ,అభయ్ , హర్షిణి తదితరులు.
సంగీతం: వివేక్ సాగర్
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్
ఛాయాగ్రహణం: పి.జి.విందా
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ