కాబుల్: అఫ్గానిస్తాన్ వరుసగా రెండో రోజూ రక్తసిక్తమైంది. శనివారంనాటి దాడిని మరువకముందే జలాలాబాద్‌లో ఆదివారం మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది దుర్మరణంపాలవగా, 60 మంది వరకు గాయపడ్డారు.
తాలిబన్ ఉగ్రవాదులు, భద్రతా దళాలు, పౌరులే లక్ష్యంగా రెండు రోజుల్లో రెండు దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. శనివారం నాటి దాడిలో కనీసం 36 మంది మృతి చెందారు.ఆదివారంనాటి ఆత్మాహుతి దాడి కూడా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల పనే అని భావిస్తున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు…
కాల్పుల విరమణ ఒప్పందంలో లేని ఐఎస్ గతంలో తాలిబన్లతో ఘర్షణ పడిన ఉదంతాలున్నాయి. అంతేకాదు, ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్థానిక సంస్థకు జలాలాబాద్‌లో అధిక ప్రాబల్యం ఉంది. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 9 రోజులు పొడిగిస్తున్నట్లు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ చేసిన ప్రకటనను కూడా తాలిబన్ తోసిపుచ్చింది. ఆ ఒప్పందం ముగిసిందని, దాన్ని కొనసాగించే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది.