‘ఆఫీసర్’ మూవీ రివ్యూ: ఇదేం సినిమా సర్!

- Advertisement -

కంటిన్యూగా ఏళ్ల తరబడి..అదో పెద్ద వృత్తిలాగే ఫీలై… ఎన్నో హిట్, ప్లాఫ్, డిజాస్టర్  సినిమాలు వరస పెట్టి చూసి, రివ్యూ రాస్తున్నా చలించని నాలాంటి వారిని కూడా కొన్ని సినిమాలు భయపెడుతూంటాయి.  రివ్యూలు రాయడం మానేస్తే హాయి అనిపిస్తాయి.  అలాంటి సినిమాలకు రివ్యూ రాయాలంటే సినిమా చూసి వచ్చాక ఉత్సాహం కూడా ఉండదు.  ఎందుకంటే సినిమానే మనలోని ఎనర్జీని మొత్తం లాగేసుకుని.. పీల్చి పిప్పి చేసేస్తుంది. అలాంటి అరుదైన సినిమాలు కంటిన్యూగా రావు  కాబట్టే ఇంకా రివ్యూ లు బ్రతికి ఉన్నాయనిపిస్తుంది. అలాకాకుండా ఇలాంటి ఆఫీసర్స్ తరచూ వస్తూంటే… ఎప్పుడో రివ్యూ రైటర్స్ నమస్కారం చెప్పేద్దురు.  వర్మగారు అలాంటి రివ్యూ రైటర్ల నిర్మూలనకు ఏమన్నా కంకంణం కట్టుకుని ఈ సినిమా తీశారేమో.  సర్లేండి… రోట్లో తలపెట్టాక రోకలి పోటుకు వెరవకూడదని సామెత.. అందుకే రాస్తున్నా రివ్యూ…

స్టోరీ లైన్ ఇదే..

ముంబై సిటీ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌ నారాయ‌ణ ప‌సారి  (ఫెరోజ్‌ అబ్బాసీ)కి అండర్ వరల్డ్ ని నామరూపాలు లేకుండా చేసాడని పెద్ద పేరు. అయితే అతనిపై ఓ మచ్చ. ఓ సారి అతను చేసిన ఎనకౌంటర్ బూటకమని డిపార్టమెంట్ కు డౌట్ వస్తుంది. దాంతో హైకోర్ట్  ఓ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేసి మరో పోలీస్ ఆఫీసర్ శివాజీరావ్‌(నాగార్జున‌)ముంబై పంపుతారు. శివాజీరావు చాలా తెలివైనవాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ సాక్ష్యం సేకరించి నారాయణ పసారిని అరెస్ట్ చేస్తాడు.

అయితే  సాక్షి  ఊహించని విధంగా మర్డర్ అవటంతో నారాయణ నిర్దోషిగా బయిటకు వచ్చి శివాజీరావుపై పగ పట్టి  యుద్దం ప్రకటిస్తాడు. అందులో భాగంగా శివాజిరావుని ఇరికించేస్తాడు. శివాజిరావు ఎలా బయిటకు వచ్చాడు. నారాయణని ఎలా పట్టించాడు అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే..

స్టోరీ లైన్ గా ..పోలీస్ డిపార్టమెంట్ తో అంతర్గతంగా ఉండే క్రిమినల్ మైండ్ లను ఎక్సపోజ్ చేయటం వరకూ బాగానే ఉంది కానీ, అంతవరకూనే కొత్తగా ఉంది. మిగతాదంతా పరమ రొటీన్ వ్యవహారం. అంటే  ట్రీట్మంట్ లో ఆ ఐడియా …అరిగిపోయిందన్నమాట. దాంతో  ఫస్టాఫ్ బాగుందే..వర్మ మళ్లీ ఫామ్ లోకి వచ్చేడే అనుకునేలోగా కథ రొటీన్ ట్రాక్ లో పడిపోయి…మనకు ఉన్న పేషెన్స్ లెవిల్స్ కు పరీక్ష పెట్టే  పోగ్రాం పెట్టుకుంది.

అది ఎంతలా అంటే బయిట ఎంత ఎండ ఉన్నా.. థియోటర్ లోపల ఎంత ఏసి ఉన్నా..ముందు అర్జెంటుగా  ఈ సినిమానుంచి బయిటపడిపోవాలి అనిపించేటంత…

వర్మ  తీత ఎలా ఉందంటే…

ఇందులో వర్మ కొత్తగా చూపిందేమీ లేదు. వర్మ సినిమాలు రెగ్యులరా చూసేవాళ్లకు ఈ సినిమా అవే సీన్స్ రిపీట్ అవుతున్న ఫీల్ తెస్తుంది. ఎప్పటిలాగే  బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగా డిజైన్ చేసారు. చాలా సీన్స్ లో  సౌండ్స్ థ్రిల్‌ చేస్తాయి.  కెమెరా పనితనంలో కూడా ఆర్జీవీ టిపికిల్ మార్క్‌ కనిపిస్తుంది. అదీ కొత్తగా అనపించదు. చైల్డ్ సెంటిమెంట్ ఏదో ఉందంటే ఉంది..లేదంటే లేదు అన్నట్లుగా ఉంది.

‘టేకెన్’ సినిమాతో పోలిక?

పోస్టర్స్, ట్రైలర్స్  చూసి టేకెన్ సినిమాని  కాపీ కొట్టి చేసారని అనుకునే ప్రచారం అబద్దమే. ఆ సినిమాకు , దీనికి అసలు పోలికే లేదు.

నాగార్జున ఎలా చేశారంటే…

నాగార్జున ఈ ఏజ్ లో కూడా ఇలాంటి పోలీస్ అధికారి పాత్ర చేయటం, ఫైట్స్ లో చెలరేగిపోవటం  చేసారు. కానీ కథ,కథనం ఆయన స్పిరిట్ ని దెబ్బ తీసేలా ఉన్నాయి.

ఒకటే డౌట్…

ఈ సినిమా చూస్తూంటే ఒకటే డౌట్ వస్తుంది..ఈ సినిమాని వర్మగారు డైరక్ట్ చేసారా లేక ఆయన వేరే వారి చేత డైరక్షన్ చేయించి, తన పేరు వేసుకున్నారా అని… ఎందుకంటే ఆయన ప్లాఫ్ లు కూడా ఇంత దారుణంగా లేవు.. (అఫ్‌కోర్స్ ఐస్‌క్రీమ్ ఈ లిస్ట్‌లో కలపద్దు).

పరిహారం ఏమిటంటే…

ఈ సినిమా గురించి తెలిసో, తెలియకో చూసేస్తే… అందుకు పరిహారం ..’శివ’ సినిమాని మళ్లీ చూడటమే! అంతకు మించిన ఆప్షన్ లేదు..

ఫైనల్ ధాట్ ఇదీ…

నాగార్జున గారూ ఇలాంటి  సినిమాలని ఎలిమినేట్ చేసేయండి సార్…

తారాగణం…

సినిమా పేరు: ఆఫీసర్‌
నటీనటులు: నాగార్జున, మైరా శరీన్‌, ఫెరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, రాజేంద్రప్రసాద్‌, అజయ్‌, ప్రియదర్శి, బేబీ కావ్య తదితరులు
సంగీతం: రవి శంకర్‌
సినిమాటోగ్రఫీ: ఎన్‌. భరత్‌ వ్యాస్‌, రాహుల్‌ పెనుమత్స
ఎడిటింగ్‌: అన్వర్‌ అలీ, ఆర్‌.కమల్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ
బ్యానర్‌: ఆర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 01-06-2018

– సూర్య ప్రకాష్ జోశ్యుల

- Advertisement -