లండన్‌లో హ్యాపీగా జీవితం గడుపుతున్న ఓ గేమ్ డిజైనర్ వరుణ్ (విజయ్ దేవరకొండ). తాను ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్) కొడుకైనా… ఆ వారసత్వం ఇష్టపడని వరుణ్‌కు వారసుడుగా అదే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తండ్రి అవినీతి ఆరోపణలపై జైలుపాలవడంతో తప్పనిసరి పరిస్దితుల్లో సీఎం అవుతాడు.
ఆ సీట్లో కుర్చునే వరకూ వరుణ్‌కి తెలియదు అదో ముళ్లకంప అని, తాను పెట్టుకున్నది ముళ్ల కిరీటమని. అంతేకాదు, బోధిసత్వుడు కథలో లాగ.. ఓసారి.. ఆ కిరీటం పెట్టుకున్నాక… తిరిగి ఆ కిరీటం దానంతట అది తనను వదిలేసి వెళ్లిపోవాలే తప్ప.. వదిలించుకోవడానికి కుదరదని.
ఏం చేస్తాడు? పైన ముళ్లు గుచ్చుకుంటున్నా… తప్పదు కదా.. ఈ డబ్బున్న వాళ్ల కష్టాలు ఎవరికి తెలుస్తాయి అన్నట్లుగా ఓర్పుగా భరిస్తాడు. మొదట రెండు వారాలు అనుకున్నది కాస్తా ఎక్కువ రోజులు అయిపోతుంది. మరోవైపు అవినీతి కేసులో ఇరుక్కున్న వరుణ్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వాసుదేవ్ ఆ తర్వాత బెయిల్ పై బయటికి వస్తూండగా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది.
ఆ బ్లాస్ట్‌లో తీవ్రంగా గాయపడిన ఆయన కోమాలోకి వెళ్లడంతో.. వరుణ్ గత్యంతరం లేక ముఖ్యమంత్రి కుర్చీలో ఇరుక్కుపోతాడు. ఊపిరి ఆడదు… కానీ అప్పుడే ఆక్సిజన్ ఎలా సంపాదించుకోవాలో అతడి మెదడు సలహాలు ఇవ్వడం మొదలెడుతుంది.
ఎదురు తిరగాలి.. ఎత్తుకు పై ఎత్తులు వెయ్యాలన్న ఆలోచన ఆ కుర్చీ కాలం సాక్షిగా పాఠాలు నేర్పుతుంది. తనకు అబ్బిన జ్ఞానంతో వరుణ్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడమేకాక, తన ప్రత్యర్దుల గుండెల్లో గునపాలు దింపగలుగుతాడు. అయితే ఆ ప్రత్యర్థులలో ఒకరిగా తన కన్న తండ్రి కూడా కలిసి పోతాడని ఎలా ఊహిస్తాడు?
ఆ తండ్రికీ తప్పదు. తనకు ముఖ్యమంత్రి పదవి కావాలి. మరోవైపు ప్రజల్లో తన కొడుక్కి మంచి పేరు వచ్చేస్తోంది. ఏదో చేయాలి… అవసరమైతే కొడుకుని తప్పించైనా సరే. ఆ పరిస్థితుల్లో వరుణ్ తండ్రి వాసుదేవ్ అదే చేస్తాడు. కానీ వరుణ్ తట్టుకోగలడా?… అప్పుడేం జరిగింది?…హోరా హోరీగా సాగిన ఆ అధర్మ యుద్దంలో గెలుపు ఎవరిది? ‘నోటా’.. డకోటా ఎందుకైంది? ఇలాంటి విషయాలన్నీ రివ్యూలో చూద్దాం.
కథ దారి తప్పి …
సినిమా పొలిటికల్ కథగా మొదలై… ఫ్యామిలీ కథగా ముగిసింది. జాలీగా గడిపే ఓ కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో ఆపధర్మ ముఖ్యమంత్రిగా ప్రయాణం మొదలెట్టడంతో మొదలైన ఈ కథ… తన ఎడ్రస్ మర్చిపోయి… రాంగ్ రూట్‌లో ప్రయాణించి.. చివరికి ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ లతో ముగిసిపోతుంది.
తెలుగు వాళ్లని మర్చిపోయి…
ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ ను తీసుకున్నారు కానీ తెలుగు నేటివిటిని అద్దటం మాత్రం మర్చిపోయారు. సినిమా మొత్తం తమిళ వాసనలతో గుభాలిస్తూంటుంది. అంతేకాదు..జయలలిత మరణానంతరం జరిగిన పరిణాలు తెలుగు వారికి చెప్పాలనుకోవటం ఓ ఇంట్రస్ట్ పుట్టించని వ్యవహారం.
లవ్ ట్రాక్ మిస్సింగ్…
ఒకే ఒక్కడు లాంటి పూర్తి పొలిటికల్ సినిమాలు ఇంతకాలం అయినా నిలబడ్డాయంటే కారణం అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కలవటమే. ఓ ప్రక్క సినిమాలో కామెడీ, మరో ప్రక్క హీరోయిన్ ట్రాక్‌తో ఆ సినిమాలు అటు మెసేజ్… ఇటు వినోదం ఇచ్చాయి. అదే ఈ సినిమాలో మిస్సైంది. కామెడీ కానీ, హీరోయిన్ ట్రాక్ గానీ లేకుండా సినిమా తీసేశారు.
పాటలెందుకు అనుకున్నారేమో…
మన కథలో హీరోయినే లేనప్పుడు… పాటలు మాత్రం ఎందుకు అనుకున్నట్లున్నారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తప్ప సినిమాలో పాట అనేది లేదు.
టెక్నికల్ గా…
సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న ఈ సినిమా…కు స్క్రీన్ ప్లేనే ఉందా లేదా అన్నట్లు ఉంది.
విజయ్ ఎలా చేశాడంటే…
విజయ్ దేవరకొండ.. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కట్టప్ప సత్యరాజ్ ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాజర్ బాగున్నాడు కానీ ఆయనకు సెకండాఫ్ లో వేసిన మేకప్పే బాగోలేదు. సంచన నటరాజన్, ప్రియదర్శి, ఎంఎస్ భాస్కర్ సినిమాకు కీలకమై నిలిచారు.
ఫైనల్ థాట్…
విజయ్ దేవరకొండ చేసిన ప్రతీ సినిమా ‘గీత గోవిందం’ స్దాయిలో ఉండదు.
Rating : 2
తారాగణం…
బ్యానర్: స్టూడియో గ్రీన్
తారాగణం: విజయ్ దేవరకొండ, నాజర్, సత్యరాజ్, మెహ్రీన్, సంచనా నటరాజన్, ప్రియదర్శి, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు
కథ: షాన్ కుప్పుస్వామి
కథనం: ఆనంద్ శంకర్, షాన్ కుప్పుస్వామి
సంగీతం: శామ్ సి.ఎస్.
కూర్పు: రేమండ్ డెరిక్ క్రాస్టా
ఛాయాగ్రహణం: సంతానకృష్ణన్, రవిచంద్రన్
నిర్మాత: కె.ఈ. జ్ఞానవేల్‌రాజా
దర్శకత్వం: ఆనంద్ శంకర్
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2018