- Advertisement -
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ తల్లి బంధువులు దగ్గరకు ఓ ఎగ్జిక్యూటివ్ వచ్చి.. ‘స్టెమ్ సెల్ బ్యాంక్’ లాభం గురించి చెబుతూ పుట్టబోయే బిడ్డ స్టెమ్ సెల్స్ తమ దగ్గర దాచుకోమని చెబుతాడు.
ఇంకో చోట.. పదో తరగతి చదివే ఓ పిల్లాడి తల్లితండ్రలకు.. ఫైనల్ ఎగ్జామ్స్ మొదలు కాకుండానే.. మీ పిల్లలని మా కాలేజీలోనే చేర్చండి..’ అంటూ కాల్స్ వస్తాయి.
మన అవసరం కోసం లోన్‌కు అప్లై చేసిన గంట నుంచే తక్కువ వడ్డీ రేటుకే అప్పు ఇస్తాం అంటూ ఇతర బ్యాంక్‌ల నుంచి కాల్స్ వస్తాయి.. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. మన జీవితంలో ఏం జరుగుతోందో ..మనం ఏం చేస్తున్నామో అవతలివాళ్లకు ఎలా తెలుస్తోంది? వాళ్లు ఎలా మన దగ్గర వాలిపోతున్నారు…?
ఈ మధ్యకాలంలో మీడియాలో ఎక్కువ గా చర్చించబడుతున్న డార్క్ వెబ్ అంటే ఏమిటి..?
సినిమా గురించి రివ్యూ ఇస్తారనుకుంటే ఇదంతా ఏమిటి.. అనిపిస్తోందా..? అవును మరి.. ఈ సినిమా చర్చించింది కూడా ఈ విషయాల గురించే కదా! అందుకే వాటిని గుర్తు చేయక తప్పలేదు.
తమిళనాడులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా.. ఇక్కడ మాత్రం సరైన పబ్లిసిటి లేకో, మరి విశాల్ గత ప్లాఫ్ సినిమాల ఎఫెక్టో తెలియదుగానీ.. ఈ సినిమాకు జనం అంతంత మాత్రంగానే ఉన్నారు. అయితే ఈ సినిమాలో అంశాలు నాలాంటి చాలా మంది సామాన్యులకు తెలియనవి, కచ్చితంగా తెలుసుకోవాల్సినవి కావటంతో ఈ సినిమా చూస్తే బాగుంటుందని.. నాలుగు రోజులు లేటైనా రివ్యూ ఇస్తున్నా.
స్టోరీ లైన్ ఇదే..
‘నా పేరు సూర్య…’ లో అల్లు అర్జున్ లాంటి క్యారక్టరైజేషన్ …ఆర్మీ మేజర్ కరుణ(విశాల్)ది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఈ యాంగ్రి యంగమెన్ కు పై అధికారులు .. ఓ సైక్రియాటిస్ట్ దగ్గర ఆరు వారాల పాటు యాంగ్రీ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ట్రీట్‌మెంట్ తీసుకుని వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చుననే కండిషన్ పెడతారు. దాంతో కరుణాకర్.. సైక్రియాటిస్ట్ లతాదేవి(సమంత)ని కలుస్తాడు. ఆమె నీ కోపం తగ్గి నువ్వు మామూలు మనిషివి అవ్వాలంటే… నువ్వు మర్చిపోయిన మీ కుటుంబాన్ని కలువు అని కండీషన్ పెడుతుంది . అలా తన విలేజ్ కు వెళ్లిన కరుణ అక్కడ తన చెల్లి పెళ్లి కి డబ్బు అవసరం అని తెలుసుకుంటాడు. అంత డబ్బు తన దగ్గర లేదు. బ్యాంక్ కు లోన్ వెళితే ఇవ్వనంటారు. దాంతో… తప్పనిసరి పరిస్థితుల్లో ఓ బ్రోకర్ మాటలు నమ్మి ఫేక్ డాక్యుమెంట్స్‌తో లోన్ తీసుకుంటాడు. పెళ్లి పనుల్లో బిజీ అవుతాడు. కానీ ఈ లోగా లోన్ తీసుకున్న డబ్బులు ..(తన సొంత డబ్బుతో) సహా బ్యాంక్ ఎకౌంట్ నుంచి మాయం అవుటం చూసి షాక్ అవుతాడు. ఎవరో ఆన్ లైన్ లో డ్రా చేశారని తెలుసుకుంటాడు.
పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే… తను వాడినవి ఫేక్ డాక్యుమెంట్స్. తాను పెద్ద ఊబిలో ఇరుక్కుపోయానని అర్దం చేసుకుంటాడు. తప్పనిసరి పరిస్దితుల్లో … తనే స్వయంగా… రంగంలోకి దిగి ఇన్విస్టిగేషన్ మొదలెడతాడు. మిలిట్రీ పరిచయాలు, మేజర్ గా తన అనుభవంతో .. తనలా చాలా మంది ఇరుక్కుపోయారని తెలుసుకుంటాడు. ఈ వైట్ కాలర్ క్రైమ్ వెనకాల…వైట్ డెవిల్(అర్జున్) ఉన్నాడని తెలుసుకుంటాడు. అప్పుడు కరుణాకర్ ఏం చేస్తాడు? వైట్ డెవిల్ అందరినీ ఎలా మోసం చేస్తున్నాడు? కరుణ అకౌంట్ నుంచి డబ్బు ఎలా మాయం అయ్యింది..? ఈ సైబర్ క్రైమ్‌ను హీరో ఎలా చేధించాడు..? అన్నదే మిగతా కథ.
ఏముంది ఇందులో..
“ఒక దేశాన్ని సర్వ నాశనం చేయాలంటే అణ్వస్త్రాలే వినియోగించాల్సిన అవసరం లేదు. ఆ దేశ సమాచార వ్యవస్థపై సైబర్ దాడి చేసి ధ్వంసం చేస్తే చాలు. కొన్ని దశాబ్దాలపాటు కోలుకోలేని దెబ్బ తగులుతుంది”
ఈ విషయాన్ని నొక్కి చెప్పాలనుకున్నాడు దర్శకుడు. చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతి సామాన్య వ్యక్తుల వరకు అందరూ సైబర్ ప్రమాదాల బారిన పడటం… మన సమాచారాన్ని మనకు తెలియకుండానే దొంగిలింపబడటం వంటి విషయాలపై ప్రాధమిక అవగాహన వచ్చేలా చేసాడు ,
మన వ్యక్తిగత సమాచారం ఎంత విలువైనది దాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు, డిజిటల్ టెక్నాలజీలోని లొసుగులేమిటి, మనకి తెలీకుండా మన జీవితాన్ని కొందరు వాళ్లకు కావాల్సిన విధంగా ఎలా మానిటర్ చేస్తున్నారు అనే విషయాలపై హెచ్చరికలు చేసాడు, డార్క్ వెబ్ లో ఏం జరుగుతోందో చూచాయగా చెప్పాడు, మనకు సంభందించిన ఇన్ఫర్మేషన్ బయిటకు ఎలా వెళ్లిపోతోంది..ఫోన్స్ ని ఎలా హ్యాక్ చేస్తున్నారు, వంటి అంశాలను చాలా క్లారిటీగా ఈ సినిమాలో చెప్పుకొచ్చాడు.
ఏమి లేదు…
అవగాహన లేక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పడుతున్న సామాన్యుడు ఇబ్బందిని, డిజిటిల్ ఇండియా అంటూ ఉత్సాహపడుతున్న మన దేశం..కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని చెప్పటంపైనే కాన్సర్టేట్ చేసారు. దాంతో ఓ టైమ్ లో డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ వచ్చి సినిమా ఎక్సపీరియన్స్ మిస్సైంది. క్లైమాక్స్ లో విలన్ ని చావు దెబ్బ కొట్టినా హీరో ప్రేక్షకుడుకి ఫీల్ రాలేదంటే దానికి కారణం … టెక్నాలిజీపై ఓ మాదిరి అవగాహన ఉన్నవాళ్లకు తప్ప మిగతా వాళ్లకు అర్దం కాకపోవటం…ఆ విషయంలో దర్సకుడు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
అలాగే తన దగ్గర సేకరించుకున్న ఇన్ఫర్మేషన్ ని అంతా ఒకే సినిమాలో గుది గుచ్చాలనే దర్శకుడు ఆలోచన కూడా సరికాదు. ఒక పాయింట్ మీద కథని పూర్తిగా నడిపితే సరిపోయేది. అంతగా అయితే ఈ సినిమా హిట్ అయ్యాక మిగతా విషయాలతో కథలు చేసుకుని సినిమా లు ప్లాన్ చేసుకోవచ్చు. ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు దొంగతనం చేయటం, డార్క్ వెబ్, మన ఎడ్రస్ లతో వ్యాపారం చెయ్యాలనుకోవటం వంటి అనేక విషయాలు ఒకే సినిమాలో కలపకుండా ఉండాల్సింది.
స్క్రీన్ ప్లే ఎలా ఉంది…
సినిమా స్క్రీన్ ప్లే …ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ సమస్యలకే కేటాయించి, సెకండాఫ్ లో అసలు కథలోకి వచ్చారు. దాంతో ఫస్టాఫ్ బోర్ వచ్చింది. ఈ సినిమా చూస్తూంటే తని ఒరువన్ (తెలుగులో ధృవ)ని మళ్లీ చూసినట్లుంది. అధే ఫార్మెట్ కథ, కాకపోతే… బ్యాక్ డ్రాప్ వేరు అంతే!
ఎవరెలా చేశారు…
విశాల్ ఎప్పటిలాగే చేసుకుంటూ పోతే, అర్జున్ …తని ఒరువన్ లో అరవింద్ స్వామిని గుర్తు చేశారు. సమంతకు సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర లేదు. మిగతా పాత్రలు సోసో..
టెక్నికల్ గా ఎలా ఉందంటే..
సినిమా కాస్త టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. ఉన్నది ఒకటే పాట. అదీ గొప్పగా లేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ గారు కొన్ని చోట్ల చూసిచూడనట్లు వదిలేసారు. దర్శకుడు ..హాలీవుడ్ సబ్జెక్టు కు తమిళ డైరక్షన్ చేసినట్లు చేశాడు.
ఫైనల్ థాట్..
ఆధార్ సమాచారానికి భధ్రత లేదన్న వార్తలు, ఫేస్‌బుక్ నుంచి కోట్లాది మంది డాటాను సేకరించి ఎన్నికలను, ప్రజాభిప్రాయాన్ని సైతం ప్రభావితం చేశారన్న ఆరోపణలు వింటూనే ఉన్నాం. ఇటువంటి టైమ్‌లో ఈ సినిమా రావటం అత్యవసరం. స్మార్ట్ ప్రపంచంలో పూర్తిగా టెక్నాలజీ మీదే ఆధారాపడే మనందరిని కచ్చితంగా ఆలోచింపచేసే సినిమా ఇది.
తెలుగులో ఎలాగూ స్టైయిట్‌గా ఇలాంటి కాన్సెప్టులో రావటం లేదు… కాబట్టి తెలుగు డబ్బింగ్‌లో అయినా చూడండి… డోంట్ మిస్ ఇట్!
– సూర్యప్రకాష్ జోశ్యుల
- Advertisement -