26.7 C
Hyderabad
Wednesday, October 14, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ హైదరాబాద్‌లో వద్దంటే వానలు.. వణుకుతున్న జనం

హైదరాబాద్‌లో వద్దంటే వానలు.. వణుకుతున్న జనం

- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరాన్ని వానలు వెంటాడుతున్నాయి. వద్దంటే వర్షాలు కుమ్మేస్తున్నాయి. మంగళవారం దంచికొట్టి నానా బీభత్సం సృష్టించిన వాన నేడు కూడా కుమ్మేస్తోంది. సాయంత్రం 5.30 గంటలకు వర్షం మళ్లీ మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, మూసాపేట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది.

సిటీ అంతటా దట్టమైన మబ్బులు కమ్మేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. వర్షం దంచికొట్టడంతో రోడ్లు జలమయమయ్యాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయంలో వాన మొదలైంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామైంది. ముందుకు పోలేక, వెనక్కి వెళ్లలేక వాహనదారులు నరకం చూస్తున్నారు. రెండు రోజుల నుంచి దంచి కొడుతున్న వానలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది.

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు రోజుల నుంచి వానలు కురుస్తుండటంతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు, మురికి నీరు ఇళ్లలోకి చేరి లోతట్టు ప్రాంతాల ప్రజలు నరకం చూస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో వర్షం పడింది.

ఈ వర్షాలకు పాత భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతున్నారు. హోర్డింగులు పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఓ యువతి తలపై పడిన పెచ్చులు ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయి.

మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో హుస్సేన్ సాగర్ నిండిపోయింది. నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరాయి. మళ్లీ వాన పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిని కిందికి వదిలే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -