
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను సోమవారం అరెస్టు చేశారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదించిన ఆర్టికల్ 370ని సోమవారం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించింది.
ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగా ఆదివారమే మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం కేంద్ర కేబినెట్ జమ్మూ కశ్మీర్‌కు ఇన్నాళ్లుగా ఉన్న ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. వెంటనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా దీనికి ఆమోదం తెలిపారు. ఆ వెంటనే దీనిపై గెజిట్ కూడా విడుదలైంది.
తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని రాజ్యసభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. అయితే జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. దీనికి నిరసనగా వాకౌట్ కూడా చేశాయి.
ముందస్తు భద్రతా చర్యలు…
తాజా పరిణామాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే దాదాపు 35 వేల మంది భద్రతా సిబ్బంది అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మరో 8 వేల మంది జవాన్లను పంపించారు.
మరోవైపు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం అన్నిరాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు, పోలీసు కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది.
శాంతి భద్రతలను కాపాడేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. హై అలర్ట్ జారీచేసి .. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. జమ్ము, కశ్మీర్ ప్రజల భద్రత, విద్యార్థులకు సరైన భద్రత ఇవ్వాలని సూచించింది.
మరోవైపు ఆదివారం నుంచే శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మొహరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేందుకు శ్రీనగర్‌కు చేరుకున్నారు.
కశ్మీర్ వీధులు నిర్మానుష్యం…
పోలీసుల పహారాలో జమ్మూ కశ్మీర్‌లోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. అటు దుకాణాలు సైతం మూసివేయబడ్డాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయం గురించి వివిధ దేశాల్లోని భారత రాయబారులకు తెలియజేసింది. ఇది తమదేశ అంతర్గత వ్యవహారమని పేర్కొంది.
ఇక అరెస్ట్ అనంతరం కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని పోలీసులు హరినివాస్ అతిథి గృహానికి తరలించినట్టు సమాచారం. ఆమెతో పాటు మరికొందరు నేతలనూ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.
నేతల ట్వీట్లు…
ఈ నేపథ్యంలో ఇటు మెహబూబా ముఫ్తీ, అటు ఒమర్ అబ్దుల్లా వేర్వేరు ట్వీట్లలో తమ ప్రతిస్పందనను తెలియజేశారు. ఏం జరగబోతోందో మనకు తెలియదని, మనకు మంచిది అనుకునేదే అల్లాహ్ చేస్తాడని తాను నమ్ముతానని ఒమర్ ట్వీట్ చేశారు.
శాంతి కోసం పోరాడే తమ లాంటి ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేశారని, మోడీ సర్కారు కశ్మీర్ ప్రజల గొంతు ఎలా నొక్కుతున్నారో ప్రపంచమంతా చూస్తోందని మెహబూబా ముఫ్తీ కూడా తన ట్వీట్‌లో విమర్శించారు.
ఇప్పటికే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లు రద్దుకు రాజ్యసభ ఆమోదం లభించిన నేపథ్యంలో మంగళవారం లోక్ సభలో జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు హోం శాఖ మంత్రి అమిత్ షా.









ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానం నేడు సాకారమైంది. ప్రతీ భారతీయుడు గర్వించవలసిన విషయం ఇది. మోడీ షా లను కొంతమంది ద్వేషించినా భావితరాలకు ఇది ఒక బహుమతి.