
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఉత్తరకొరియా పర్యటనకు బయలుదేరారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరగనున్న సమావేశమే ఈ పర్యటన ప్రధాన ఎజెండా. పర్యటనలో భాగంగా ఉత్తరకొరియా ఆర్థిక సమస్యలు, అణు కార్యక్రమాల అంశాలు ఇరుదేశాధినేతల నడుమ చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
చైనాకు ఉత్తరకొరియా ప్రధాన వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో చైనా, ఉత్తరకొరియా దేశాధినేతలు ఇప్పటికే చైనాలో నాలుగుసార్లు సమావేశమయ్యారు.
త్వరలో జపాన్‌లో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు కూడా చైనా అధ్యక్షుడు హాజరుకానున్నారు. అయితే అంతకంటే ముందు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలని జీ జిన్‌పింగ్ ఆలోచన.
14 ఏళ్ల తరువాత తొలిసారిగా…
2005 తరువాత చైనా అధ్యక్షుడు ఉత్తరకొరియాలో పర్యటించలేదు. దీంతో 14 ఏళ్ల తరువాత ఉత్తరకొరియా పర్యటనకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బయలుదేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ల మధ్య హనోయిలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్యలు ఫలప్రదం కాలేదు. ఆ తరువాత జిన్‌పింగ్.. కిమ్‌ను కలవడం ఇదే తొలిసారి.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఆమధ్యన వరుసగా అణు, క్షిపణి పరీక్షలకు పాల్పడుతూ అమెరికా కంటికి కునుకులేకుండా చేశారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా చేపట్టిన అణుపరీక్షలను నిలిపివేయించేందుకు సామ, దాన, బేధ, దండోపాయాలన్నీ ప్రయోగించారు. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి చేత అనేక ఆంక్షలు విధింపజేశారు.
ఉత్తరకొరియాతో అంటీముట్టనట్టుగా చైనా…
ఈ నేపథ్యంలో ట్రంప్ ఉత్తరకొరియా మిత్రదేశమైన చైనాపై కూడా బాగా ఒత్తిడి తీసుకొచ్చారు. కిమ్ అణుపరీక్షలు ఆపేలా చైనా అధ్యక్షుడు సహకరించాలని కోరారు. అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి కారణంగా చైనా కూడా కొంతకాలంపాటు ఉత్తరకొరియాతో అంటీముట్టనట్లుగా వ్యవహరించింది. దీంతో కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
చైనా అద్యక్షుడు జీ జిన్‌పింగ్ తాజా పర్యటనతో తిరిగి ఆ దేశంతో సత్సంబంధాలు నెలకొనడానికి ఆస్కారం ఉందని చైనా భావిస్తోంది. 2012లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జీ జిన్‌పింగ్ ఉత్తరకొరియాను సందర్శిస్తుండడం కూడా ఇదే మొదటిసారి.
ఇదీ చైనా కోరిక…
ఉత్తర కొరియాలో స్థిరత్వం ఏర్పడాలని, ఆ దేశంతో ఆర్థిక సహకారం బాగుండాలనే లక్ష్యంతో చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు జీ జిన్‌పింగ్ పర్యటనతో ఇరు దేశాధినేతల మధ్య కొన్ని ప్రాజెక్టులపై అంగీకారం కుదురుతుందని చైనా అధికార పత్రిక జిన్హువా బుధవారం ఆశాభావం వ్యక్తం చేసింది.
కిమ్ ఏమనుకుంటున్నారంటే…
మిత్రదేశమైన చైనాతో ఇటీవలి కాలంలో సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడి పర్యటన మూలంగా ఇకమీదటైనా తమకు చైనా మద్దతు ఉందనే ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు అవకాశం కలుగుతుందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భావిస్తున్నారు.
ఉత్తరకొరియాపై అమెరికా విధించిన కొన్ని ఆంక్షలను సడలించాలంటూ చైనా డిమాండ్ చేయడం కూడా కిమ్ జోంగ్ ఉన్‌కు ఇప్పటికీ చైనా మద్దతు ఉందన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది.








