
హైదరాబాద్: పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరిపినప్పటికీ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తన ముగ్గురు కుమారులతో కలిసి బుధవారం సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరికపై ఇప్పటికే కేటీఆర్, కవితతోనూ ఆమె చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఓ పారిశ్రామికవేత్త కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది.
చేవెళ్ల సీటు కోసం..
కాగా, తన కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ టికెట్ కేటాయించాలంటూ కేసీఆర్‌ను సబిత కోరుతున్నట్లు సమాచారం. ఇటీవల అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబిత, కార్తీక్‌రెడ్డి మంతనాలు జరిపారు. అయితే, చేరికపై తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణ్రయం తీసుకుంటారని కేటీఆర్ వారికి చెప్పారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సబితను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మెత్తబడలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆమెకు ఫోన్ చేసినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తనవంతుగా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఆమె బుధవారం కేసీఆర్‌ను కలవడంతో టీఆర్ఎస్లో చేరిక ఖాయమైనట్లేనని తెలుస్తోంది.








