
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల నష్టపోయి 48.2 ఓవర్లకే ఛేదించింది.
కేదార్ జాదవ్ (81; 87 బంతుల్లో 9×4, 1×6), ఎంఎస్ ధోనీ (59; 72 బంతుల్లో 6×4, 1×6) అజేయంగా నిలిచారు. కష్టాల్లో పడ్డ జట్టును గెలుపు బాట పట్టించారు. విరాట్ కోహ్లీ (44; 45 బంతుల్లో 6×4, 1×6), రోహిత్ శర్మ (37; 66 బంతుల్లో 5×4) రాణించారు. అంతకు ముందు ఆసీస్‌లో ఉస్మాన్ ఖవాజా (50; 76 బంతుల్లో 5×4, 1×6), గ్లెన్ మాక్స్‌వెల్ (40; 51 బంతుల్లో 5×4) ఆకట్టుకున్నారు.
మరోసారి ధోనీ మాయ….
లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 4 వద్దే ఓపెనర్ శిఖర్ ధావన్ (0) ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (37)తో కలిసి విరాట్ కోహ్లీ (44) నిలకడగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం అందించారు. అర్ధశతకానికి చేరువలో ఉన్న విరాట్‌ను జట్టు స్కోరు 80 వద్ద జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
మరికాసేపటికే రోహిత్ ఓ సులభ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పుడు స్కోరు 95. మరో 4 పరుగులకే అంబటి రాయుడు (13) ఔటవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ (59)తో అండతో కేదార్ జాదవ్ (81) చెలరేగాడు. మొదట్లో ఈ జోడీ ఆచితూచి ఆడింది. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించింది. ఆసీస్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సమయం కోసం ఎదురుచూసింది.
భాగస్వామ్యం 70 పరుగుల దాటిన తర్వాత వీరిద్దరూ ధాటిగా ఆడారు. జాదవ్ అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. ధోనీ అతడికి చక్కని ప్రోత్సాహం అందించాడు. చివర్లో ధోనీ అర్ధశతకం చేశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 141 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి విజయం అందించారు. చివర్లో ఎంఎస్ వరుసగా రెండు బౌండరీలు బాదడం విశేషం.
చదవండి: మెగా టోర్నీకి చివరి సన్నాహం! ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ ఉప్పల్‌లో తొలి పోరు!








