

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మొదటి విడత ఎన్నికలు జరిగే 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు, 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
ఈ క్రమంోల 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తర్వాత పంచాయతీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. కాగా, 12,202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది బరిలో నిలిచారు. 12 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గట్టి బందోబస్తు: 25,30తేదీల్లో మిగితా విడతల్లో పోలింగ్
పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉపసర్పంచి ఎన్నికనూ రిటర్నింగ్ అధికారి చేపడతారు. మిగతా రెండు విడతల పోలింగ్ జనవరి 25,30 తేదీల్లో జరగనుంది. కాగా, రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.








