సంశయం: ఏమిటీ పండగల గోల? ఇంతకీ దసరా ఎప్పుడు?

dussehra
- Advertisement -

ravana-dahanam

ఇదేమిటో! ఈ మధ్య పండుగలు అన్నీ రెండేసి రోజుల చొప్పున వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విషయం చెబుతున్నారు. ఇంతకీ పండుగ ఏ రోజు చెయ్యాలో అర్థం కావడం లేదు, అంతా సంశయం.. సందేహం.

సగటు హైందవుడి మదిలో ఇటివలి కాలంలో ఉదయిస్తున్న ప్రశ్న ఇది. నిజానికి ఇందులో ఎలాంటి సంశయం లేదు. లోపమంతా మనలోనే ఉంది. అవును.. ఒక ఊరికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గమే ఉంటుందా? అనేక మార్గాలు ఉంటాయి. వీటిని మార్గాంతరాలు అన్నట్లే… జీవిత లక్ష్యమైన మోక్ష గమ్యానికి మన ఋషీశ్వరులు అనేక మార్గాలను సూచించారు. వీటినే మతాంతరాలు అని అంటారు.(హిందూ, ఇస్లాం… కావు).

ఇరవై.. ముప్ఫై ఏళ్ళ క్రితం వరకు కూడా దాదాపు ప్రతి ఒక్కరికి గురువు, ఇంటి పురోహితుడు ఉండేవారు. వారి నిర్ణయానుసారం అన్నీ సక్రమంగా జరిగేవి. ఎలాంటి తికమకలు, గందరగోళాలూ లేవు. అవసరమైతే పండితులు చర్చించుకొనే వారు. సగటు హైందవుడు తన గురువు లేదా ఇంటి పురోహితుని వాక్కును చిత్తశుద్ధితో అనుసరించేవాడు.

నవనాగరిక పోకడలలో… ఎవరికి వారు స్వయంగా నిర్ణయం చేసుకోవడం, పైగా.. టీవీ ఛానళ్ళలో వచ్చే విపరీతమైన ప్రచారాలు మొదలైన కారణాల వల్లనే ఈ గందరగోళం ఏర్పడుతోంది. మతాంతర విషయాలను ఏకీకృతం చేసే ప్రయత్నాలు ఇందుకు మూలం.  మతాంతర విషయాలపై తీర్పు ఇవ్వాలంటే… వాద-ప్రతివాదుల ధర్మ నియమాలు క్షుణ్ణంగా ఆపోశన పట్టిన వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో ఉండాలి.

పరిపాలనా విభాగంలో నిష్ణాతుడైన ఒక వ్యక్తి జ్యోతిషం వ్యర్థం, శుద్ధ దండగ అని తీర్పు చెబితే ఎలా?  అపరాజితపృచ్ఛ, సమరాంగణ సూత్రధార, విశ్వకర్మ ప్రకాశిక ఇత్యాది గ్రంథాల పేర్లు కూడా వినని తాపీ మేస్త్రీ(క్యాలెండర్‌ ల వెనుక ఉన్న కొన్ని సూత్రాలను చదివి, లేదా విని) వాస్తు శాస్త్రంపై సూచనలు ఇవ్వడం గందరగోళానికి నాంది కాదా?

సరే! ఈ సంవత్సరం దసరా పండుగను పరిశీలిద్దాం.  దినద్వయ, అపరాహ్ణ వ్యాప్తి ఇత్యాది లోతైన విషయాలను కాసేపు విస్మరిద్దాం.  దసరా పండుగకు సామాన్య నియమం ఏమిటి?  కేవలం ఆశ్వీజ శుద్ధ దశమి తిథి మాత్రమే ప్రమాణం కాదు. దశమి ఘడియలతో పాటుగా శ్రవణ నక్షత్ర సమ్మేళనం అత్యంత కీలకం.

ఇంగ్లీషు తేదీల ప్రకారం…

18 వ తేదీన మధ్యాహ్నం గం. 3:29 ని.ల నుంచి 19 వ తేదీన సాయంత్రం గం. 5:57 ని.ల వరకు దశమి వ్యాపించి ఉన్నది. ఈ తిథి వ్యాప్తిని చూస్తే, దసరా పండుగ 19 వ తేదీనే. అయితే ఇంతటితో నిర్ణయం చేయడం శుద్ధ తప్పు. నక్షత్ర వ్యాప్తిని కూడా గమనించాలి.

శ్రవణ నక్షత్రం – 17 వ తేదీన రాత్రి గం. 9:28 ని.ల నుంచి 18 వ తేదీన అర్ధరాత్రి దాటాక అంటే, 19 వ తేదీ ప్రవేశించిన 34 ని.ల వరకే (12:34 AM) ఉంటుంది. అంటే.. 19వ తేదీన సూర్యోదయ సమయానికి శ్రవణ నక్షత్రం ఉండదు, ధనిష్ఠ నక్షత్రం ఉంటుంది.

ఇప్పుడు గమనించండి… ఆశ్వీజ శుద్ధ దశమి + శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న రోజు ఏది?  నిర్ద్వంద్వంగా 18 వ తేదీయే.  కనుక, దసరా పండుగను 18 వ తేదీనే జరుపుకోవాలి. (మహర్నవమి – ఆయుధ పూజ కూడా).  ధర్మ లోతులను పరిశీలించక, గురువులను ఆశ్రయించక మిడిమిడి జ్ఞానంతో మహోన్నతమైన హిందుత్వాన్ని దూషించడం కుసంస్కారమే!

సద్గురువులను ఆశ్రయించి, ధర్మ లోతులను పరిశీలించండి. ఆనందంగా జీవించండి.  స్వస్తిశ్రీ విలంబ విజయదశమి శుభాకాంక్షలు, శుభాశీస్సులతో మంగళాశాసనములు.
శుభం భూయాత్!
మంగళం మహత్!!

– పంతంగి రమాకాంత శర్మ

పీఠాధిపతి, శ్రీ పంచాయతన శక్తి పీఠమ్, హైదరాబాద్, ఫోన్: 9849804463

- Advertisement -