ఇంటిని చూసి ఇల్లాలి గుణగణాలు చెప్పొచ్చని అంటారు మన పెద్దలు. మరి ఈ మాట వారు ఊరికే చెప్పలేదు. ఇంటి నిర్వహణలో మహిళల పాత్రే కీలకం. కుటుంబం కలిసుండాలన్నా, విడిపోవాలన్నే ఆ కుటుంబంలోని మహిళల చేతిలోనే ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు కొన్ని తప్పసరిగా పాటించాలట. అలా పాటించని పక్షంలో ఆ ఇంటిలో దరిద్రం తాండవిస్తుందట. మరి, ఇంటి ఇల్లాలు చేయాల్సిన ఆ పనులేమిటో చూద్దామా?
సూర్యోదయానికి ముందే మహిళలు తమ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే దారిద్ర్యానికి దారితీసినట్లే. అలాగే ఇంటిని శుభ్రం చేసిన వెంటనే మహిళలు స్నానం ముగించాలి. ఇంటిని శుభ్రం చేశాక స్నానం చేయకపోయినా, చేద్దాంలే అని బద్దకించినా ఆ ఇంట్లో పేదరికంతోపాటు దు:ఖం కూడా కలుగుతుంది.
పూజ ముగించి, దేవుడికి నైవేథ్యం సమర్పించిన తర్వాతే భోజనం చేయాలి. అలా కాకుండా ఉదయాన్నే తినేసి, ఆ తర్వాత దేవుడికి నైవేథ్యం పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దక్కదట. అందుకే రోజూ స్నానం ముగించుకుని, పూజ చేసిన తరువాతే వంట చేయడం మొదలుపెట్టాలి. కుటుంబం కోసం వంట చేయడం కూడా దేవుడికి నైవేథ్యం వండటంతో సమానమట.
ఇక సూర్యాస్తమయం తర్వాత మహిళలు తల దువ్వుకోకూడదట. దీని వల్ల వారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అందుకే సాధ్యమైనంత వరకు సాయంత్రం వేళ తల దువ్వకపోవడమే మంచిది. అలాగే మహిళలు సహనంగా ఉండాలి. ఎప్పుడూ చిరాకు, కోపంతో ఉంటే ఆ ఇంట్లో సంతోషమే ఉండదట. అకారణంగా చిరాకు పడటం, కోపగించుకోవడం లాంటివి మహిళలు తగ్గించుకోవాలట. ఏ ఇంట్లో అయితే మహిళలు సహనం ప్రదర్శిస్తారో ఆ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందట.