
హైదరాబాద్: టీడీపీకి, ఆ పార్టీ అధినాయకత్వానికి ఊహించని షాక్ ఇచ్చారు ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ. తాజాగా ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పి ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ నివాసంలో ఆమె భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. పార్టీ కండువా కప్పి జయసుధను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ… చాలా సంతోషంగా ఉందని, మళ్లీ తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. ఈ విషయంలో తాను ధీమాగానే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని చెప్పారు.
టీడీపీపై కీలక వ్యాఖ్యలు…
తెలుగుదేశం పార్టీలో చేరినా తాను క్రియాశీలకంగా లేకపోవడానికి కారణం తాను కాదని, పార్టీ పెద్దలేనని జయసుధ వ్యాఖ్యానించారు. ‘‘ఎవరూ పార్టలో చేరగానే యాక్టివ్ కారు.. కొత్తగా వచ్చిన వారిని ఎవరో ఒకరు గైడ్ చేయాలి. రాజశేఖర్ రెడ్డిగారి పార్టీలో చేరినప్పుడు ఆయన అదే చేశారు. అయితే టీడీపీలో అది జరగలేదు..’’ అని ఆమె విమర్శించారు.
తొలుత జయసుధ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత ఆమె ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరిన జయసుధ తాజాగా వైఎస్సార్సీపీలో చేరారు.
జయసుధను నటుడు మురళీమోహన్ టీడీపీలో చేర్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే టీడీపీలో ఉన్నప్పటికీ జయసుధ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీమోహన్ వచ్చే ఎన్నికలకు దూరం కావడంతో జయసుధ కూడా టీడీపీని వీడినట్లుగా వినిపిస్తోంది.
అయితే మురళీమోహన్ ఇంకా టీడీపీలో కొనసాగుతుండగానే.. జయసుధ మాత్రం బయటికొచ్చేసి వైఎస్సార్సీపీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది.







