హైదరాబాద్: నగరంలోని లోటస్పాండ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, బహిష్కృత నేత శివకుమార్ రాజీకొచ్చారు. గురువారం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో శివకుమార్ మాట్లాడుతూ.. ఈ రోజు ఒక శుభదినం అని అన్నారు.
వైసీపీ స్థాపించి తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తయ్యిందని… పార్టీ కోసం అంకిత భావంతో పని చేసినా.. కొన్ని కారణాలతో పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. 3 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని.. వైఎస్ జగన్ పెద్ద మనసు చేసుకుని తనను తిరిగి స్వాగతించారని కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు సంక్షోభంలో ఉన్నాయన్నారు శివకుమార్. ఎన్నికల ప్రకటన సమయంలో పార్టీ లైన్ వేరేలా ఉంది.. తన లైన్ వేరేలా ఉంది.. దాంతో పార్టీ నుండి తనను తొలగించారని వివరణ ఇచ్చారు. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు
దేశ ప్రధాని నిర్ణయించేది జగన్మోహన్ రెడ్డియేనని ఆయన అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్తో అన్ని విషయాలు కూలంకశంగా మాట్లాడానని.. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని శివకుమార్ ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని జీర్ణించుకోలేక టీడీపీ అనేక అక్రమాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
టీడీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చొరవ తీసుకుని తనపై బహిష్కరణకు ఎత్తివేసినందుకు వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలుపుకున్న శివకుమార్.. పార్టీ అధిష్టానంతో చర్చించి వేసిన పిటిషన్ వెనక్కి తీసుకునే దిశగా ముందుకు వెళ్తానని వెల్లడించారు. దీంతో వైసీపీ అధినేతతో ఉన్న వివాదం పూర్తిగా సమసిపోయినట్లైంది.








